అనర్హత పిటిషన్ : 30 రోజుల సమయం కుదరదు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పిన స్పీకర్ తమ్మినేని

Siva Kodati |  
Published : Jan 26, 2024, 07:25 PM ISTUpdated : Jan 27, 2024, 01:54 PM IST
అనర్హత పిటిషన్ : 30 రోజుల సమయం కుదరదు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పిన స్పీకర్ తమ్మినేని

సారాంశం

అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు ఇచ్చారు.

అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు ఇచ్చారు. తొలుత సహజ న్యాయ సూత్రాల ప్రకారం వివరణ ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సభాపతి.. 30 రోజుల సమయం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. 

కాగా.. రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదముద్ర వేయడంతో అగ్గిరాజుకుంది. రెండేళ్లుగా సైలెంట్‌గా వుండి సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజీనామాను ఆమోదించడం ఏంటంటూ వైసీపీపై టీడీపీ భగ్గుమంది. అలాగే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌ను కోరింది. 

ఈ నేపథ్యంలో వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ పావులు కదుపుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ తమ్మినేనిని ఆ పార్టీ కోరింది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా సభాపతిని కోరారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఇప్పటికే పిటిషన్ వేశారు. డోలా అనర్హత పిటిషన్‌పై స్పీకర్.. చంద్రబాబు అభిప్రాయం కోరగా, టీడీపీ చీఫ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. 

ఈ నేపథ్యంలో పార్టీలు మారిన వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29న స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుందని, ఉదయం పూట వైసీపీ రెబెల్స్ , మధ్యాహ్నం టీడీపీ రెబెల్స్  హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఇరు పార్టీల ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 29న ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Lokesh Speech:ఆరోజు అండగా నిలబడ్డారు.. అందుకే మీరుణం తీర్చుకోడానికి వచ్చా | Asianet News Telugu
YSRCP Leaders Protest in Vijayawada | Demand Removal of TTD Chairman B R Naidu | Asianet News Telugu