Kodi kathi Srinivas: కోడికత్తి కేసులో ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న జనుపల్లి శ్రీను ఎట్టకేలకు విడుదలయ్యాడు. కోడికత్తి కేసు నిందితుడిగా ఉన్న శ్రీనుకు గురువారం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Kodi kathi Srinivas: ఎట్టకేలకు కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను విడుదలయ్యాడు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన శ్రీను ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాడు.
ఈ క్రమంలో శ్రీనుకు ఎస్సీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ చిత్ర పటం పట్టుకున్న కోడికత్తి శ్రీను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. సీఎం జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన శ్రీను ఐదేళ్ల పాటు జైలులోనే ఉన్నారు. తాజాగా ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకీ కేసేంటీ..?
2018లో సీఎం జగన్(CM Jagan)పై అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయం(Visakha Airport) లో కోడి కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీన్ని న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై కొద్దిరోజుల క్రితం విచారణ జరిగింది.బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గిపోతున్నాడంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సుధీర్ఘకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు తెలిపారు.
ఆయన వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వు చేస్తూనే.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్ తో పాటు, రూ.25 వేల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరవ్వాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.