జనసేన నేతలు ఇవాళ నారా బ్రహ్మణితో రాజమండ్రిలో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణితో జనసేన నేతలు ఆదివారంనాడు రాజమండ్రిలో భేటీ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో రాజమండ్రి జైలుకు సమీపంలోనే నారా లోకేష్ తన క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఈ కార్యాలయంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి, బ్రహ్మణి ఉంటున్నారు.
చంద్రబాబు నాయుడు కేసు విషయమై ఢిల్లీలోని పలు పార్టీల నేతలు, న్యాయ నిపుణులతో చర్చిచేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఇతర పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని రెండు వారాల క్రితం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు, రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై బ్రహ్మణితో జనసేన నేతలు చర్చించారని సమాచారం. నారా బ్రహ్మణితో జనసేనకు చెందిన కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిశదర్, చంద్రశేఖర్ తదితరులు భేటీ అయ్యారు. వైసీపీ సర్కార్ విధానాలను నిరసిస్తూ టీడీపీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని జనసేన నేత కందుల దుర్గేష్ ఇవాళ మీడియాకు చెప్పారు.చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడ అరెస్టు అవుతారని ప్రచారం సాగుతుంది.లోకేష్ కూడ అరెస్టైతే బ్రహ్మణి పార్టీ నిర్వహణ బాధ్యతలు చేపడుతారని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడ ఈ విషయాన్ని విశాఖపట్టణంలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో బ్రహ్మణి కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఇవాళ జనసేన నేతలు బ్రహ్మణితో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.