అభిమానులు, కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందినే కాదు మీడియా ప్రతినిధులను నందమూరి బాలకృష్ణ వదిలిపెట్టలేదు. టిడిపి అనుకూల మీడియా సంస్థగా ముద్రపడ్డ ఈనాడు ప్రతినిధిపైనే బాలయ్య చిందులు తొక్కారు.
రాజమండ్రి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ బాలకృష్ణ బాగా కోపిష్టి అన్నవిషయం ఆయన వ్యవహారతీరును బట్టి తెలుస్తుంది. చివరకు నిత్యం ప్రజల్లో వుండాల్సిన రాజకీయ నాయకుడిగానూ బాలకృష్ణ తీరులో మార్చులేదు. తాజాగా టిడిపి అనుకూల మీడియా ప్రతినిధిపైనే బాలయ్య ఆవేశంగా చిందులుతొక్కారు.
వివరాల్లోకి వెళితే... చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడంతో ఆయన కుటుంబం కూడా అక్కడే వుంటోంది. రాజమండ్రిలోని విద్యానగర్ లో నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేసుకున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఈ క్యాంప్ ఆఫీస్ లోనే వుంటున్నారు. గత శనివారం బాలకృష్ణ కూడా లోకేష్ క్యాంప్ ఆఫీస్ లో టిడిపి నేతలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు.
'ఈనాడు' ఫోటో గ్రాఫర్ పై బాలకృష్ణ చిందులుతొక్కినట్లు 'సాక్షి' ఓ కథనంలో పేర్కొంది. తాను ఈనాడు ప్రతినిధిని అని చెప్పినప్పటికీ వినకుండా బాలకృష్ణ అతడిని అసభ్యకరంగా బూతులు తిట్టారట. బాలయ్య తీరుతో మీడియా ప్రతినిధులే కాదు టిడిపి నాయకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారట. బావ చంద్రబాబు ఇప్పటికే అరెస్టవగా అల్లుడు లోకేష్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో బాలకృష్ణ సహనం కోల్పోతున్నారని... అందువల్లే ఇలా ప్రవర్తించివుంటారని పేర్కొన్నారు.
Read More చంద్రబాబు సీటుపై బాలకృష్ణ కన్నేసాడు... అందుకే ఇదంతా..: రోజా సంచలనం
ఇదిలావుంటే గతంలో బాలకృష్ణ పలువురిపై చేయిచేసుకున్న ఘటనలు సంచలనంగా మారాయి. నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలపైనే కాదు వ్యక్తిగత సిబ్బందిపైనా బాలకృష్ణ చేయిచేసుకున్న ఘటనలు అనేకం వున్నారు. ఇక కోపం వస్తే బాలకృష్ణ నోటివెంట బూతులు వస్తుంటాయని సినిమావాళ్ళు చెబుతుంటారు. సినిమాల్లో ఆయన పెద్ద హీరో కాబట్టి ఏం చేసినా, ఎలా వున్నా చెల్లుతుంది... కానీ రాజకీయాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.