
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోని అందరు సీఎంల కంటే అత్యధిక ఆస్తులుకలిగిన నెంబర్ వన్ గా నిలిచారని... కానీ ఇదే సమయంలో ఏపీ అప్పుల్లో నెంబర్ వన్ గా వుందంటూ జనసేన పార్టీ నేత పోతిన మహేష్ ఎద్దేవా చేసారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచిన జగన్ కు కంగ్రాట్స్ సీఎం సార్ అని చెప్పాలని వుందంటూ మహేష్ సెటైర్లు వేసారు.
ఏపీ సీఎం జగన్ ఆస్తులు చూసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆశ్చర్చపోతారేమోనని మహేష్ అన్నారు. మిగతా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిపినా జగన్ ఆస్తుల ముందు దిగదుడుపే అని అన్నారు. ముఖ్యమంత్రులు అందరి ఆదాయం జగన్ కాలిగోటికి కూడా సరిపోవడం లేదన్నారు. జగన్ ఒక్కరి ఆస్తే ఇంత వుంటే కుటుంబసభ్యులు, బినామీల ఆస్తులు ఇంకెన్ని వేలకోట్లు వుండివుంటాయో ప్రజలే ఊహించుకోవాలని జనసేన మహేష్ అన్నారు.
వీడియో
దేశంలోనే ధనిక సీఎంగా నిలిచిన జగన్ తనకు అంగబలం, అర్థబలం లేదని అనడం హాస్యాస్పదంగా వుందన్నారు జనసేన నేత. తాను రోజురోజుకు మరింత ధనికుడిగా మారుతున్న జగన్ రాష్ట్రాన్ని కూడా అప్పుల్లో నెంబర్ వన్ చేసారని ఎద్దేవా చేసారు. జగన్ పాలనలో ఏపీ అప్పులు పదిలక్షల కోట్లు దాటిపోయాయని అన్నారు. జగన్ లాంటి వైట్ కాలర్ నేరస్తులకు ఒక్క అవకాశమిస్తేనే రాష్ట్రం అధోగతి పాలయ్యిందని పోతిన మహేష్ అన్నారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం దేశంలోని 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నట్లుగా తేలింది. ఏడీఆర్ విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్స్ ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు టాప్ లో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యల్పంగా రూ.15 లక్షల ఆస్తులు మాత్రమే కలిగివున్నట్లు ఏడీఆర్ తెలిపింది.
ప్రస్తుత 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన తర్వాత తాము ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ (న్యూ) తెలిపాయి. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు. 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది (97 శాతం) కోటీశ్వరులేనని, ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
ఏపీ సీఎం జగన్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా ఖండూ రూ.163 కోట్లతో రెండో స్థానంలో, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ రూ.63 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ .15 లక్షలు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోటి రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కోటి రూపాయలతో అత్యల్ప ఆస్తులు కలిగివున్న సీఎంలుగా వున్నారని ఏడీఆర్ తెలిపింది.