గెలిపించిన వారినే అవమానిస్తూ... వైసిపి పాలకుల వికృత చేష్టలివే..: నాదెండ్ల మనోహర్ సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2022, 02:23 PM ISTUpdated : Mar 21, 2022, 02:28 PM IST
గెలిపించిన వారినే అవమానిస్తూ... వైసిపి పాలకుల వికృత చేష్టలివే..: నాదెండ్ల మనోహర్ సీరియస్

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు మహిళలు వుండగానే ఓ ఇంటికి తాళంవేసి గృహనిర్భంధం చేసిన ఘటనపై జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. 

విజయవాడ: వైసిపి (ysrcp) ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరంకుశంగా పాలిస్తోందని... ప్రజలను సమస్యలు లేకుండా చూడాల్సిన సర్కారే డబ్బుల కోసం సమస్యలు స‌ృష్టిస్తోందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ఆరోపించారు. జగన్ రెడ్డి అహంకారంతో ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లకు తాళాలు వేయడం... కుళాయిలకు బిరడాలు కొట్టడం.. దుకాణాల ముందు చెత్త పోయడం... పాలకుల వికృత మనస్తత్వానికి అద్దంపడుతున్నాయని నాదెండ్ల అన్నారు. 

''ప్రజలను పీడించి... వేధించి ఖజానా నింపుకోవాలనే అహంకారపూరిత నైజంతో జగన్ రెడ్డి (ys jagan) పరిపాలన చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ఓటీఎస్ (OTS) పేరుతో పేదల ముక్కుపిండి డబ్బులు గుంజారు. ఇప్పుడు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్నుల వసూలు విధానంలో పాలకులు ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు'' అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా ప్రజలు మా దగ్గరపడి ఉండాల్సిందే అన్న నియంతృత్వ ధోరణే వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇదేనా వైసీపీ చెబుతున్న సంక్షేమ పాలన. ప్రస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా ప్రజల గౌరవాన్ని కించపరచలేదు... ఈ ప్రభుత్వమే ఇలా గెలిపించిన ప్రజలనే అవమానిస్తోంది'' అని నాదెండ్ల మండిపడ్డారు.

''తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ (pitapuram municipality)లో ఇంట్లో మహిళలు ఉండగానే అధికారులు ఇళ్లకు సీలు వేయడం అనేది అక్రమ గృహ నిర్బందమే అవుతుంది. ఆ కుటుంబ సభ్యుల పరువుప్రతిష్టలను మంటగలిపేలా ప్రవర్తించారు. ఇది ఖచ్చితంగా క్రిమినల్ చర్య. ఇటువంటి దుశ్చర్యకు పాలకులను ప్రజలు నిలదీయాలి'' అని నాదెండ్ల సూచించారు. 

''ఆస్తి పన్ను వసూలు కోసం జప్తు వాహనాలు తిప్పుతూ పన్ను కట్టకపోతే ఇంట్లో సామానులు పట్టుకుపోతాం అని బ్యానర్లు కట్టుకొని తిరగడం వైసీపీ పాలకుల దోపిడీ మనస్తత్వాన్ని వెల్లడిస్తోంది. ప్రజలు తాగు నీటికి అల్లాడుతుంటే కుళాయిలకు బిరడాలు వేసి వేధిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే చెత్తను తీసుకువచ్చి దుకాణాల ముందు, ఇళ్ల ముందు పోస్తున్నారు. ఈ వైఖరి పాలకుల వికృత మనస్తత్వాన్ని వెల్లడిస్తోంది'' అని నాదెండ్ల అన్నారు. 

''పన్ను కట్టకపోతే జప్తు చేసే అధికారం మున్సిపల్ అధికారులకు లేదని ప్రజలు గుర్తించాలి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కలెక్టర్ ఆ ప్రక్రియ చేయాలి. అసలు రాష్ట్రంలోని కలెక్టరేట్లే ఆస్తి పన్ను కోట్ల రూపాయిలు బకాయిలుపడి ఉన్నాయి. ప్రజల ఆస్తులు జప్తు చేసే ముందు కలెక్టర్ కార్యాలయాలు జప్తు చేయాల్సి ఉంటుంది. అలాగే చెత్త లాంటివి ఇంటి ముందు పోస్తే వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చు. ప్రజల గౌరవమర్యాదలకు భంగం కలిగేలా ప్రభుత్వం చేసే చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలకు జనసేన అండగా ఉంటుంది'' అని నాదెండ్ల పేర్కొన్నారు. 

ఇక పిఠాపురం ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.. వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చినట్టు తెలిసిందన్నారు. ఎక్కడో జరిగిన చిన్న సంఘటనలను సాకుగా చూపుతూ రాష్ట్రమంతా అలా జరిగినట్లు పత్రికలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని... ప్రతీ ఇంటికి‌ కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమన్నారు. అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దని... అధికారికంగా కనెక్షన్ ప్రజలని‌ కోరుతున్నారన్నారు. 

పన్నుల కట్టకపోతే జప్తులు అన్నది ఎప్పటినుంచో ఉంది... ఈ రోజు కొత్తగా వచ్చింది కాదన్నారు. కానీ పన్నుల కట్టకపోతే జప్తులు అన్నది ఎప్పటినుంచో ఉందని ఈ రోజు కొత్తగా వచ్చింది కాదన్నారు. కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయనుకుంటే స్ధానిక సంస్థల దృష్డికి తీసుకెళ్లవచ్చన్నారు. ప్రజలని గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా వ్యవహరించవద్దని మంత్రి బొత్స సూచించారు. 

 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు