Cyclome Asani: సాయంత్రానికి బంగాళాఖాతంలో తుఫాను... రానున్న ఐదురోజులు ఏపీలో వర్షాలు

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2022, 12:58 PM ISTUpdated : Mar 21, 2022, 01:01 PM IST
Cyclome Asani:  సాయంత్రానికి బంగాళాఖాతంలో తుఫాను... రానున్న ఐదురోజులు ఏపీలో వర్షాలు

సారాంశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తీవ్ర అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారగా ఇది సాయంత్రానికి తుఫాను గా మారే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది. 

అమరావతి: వేసవి ఆరంభంలోనే మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లటివార్త చెప్పింది. ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారగా అదికాస్తా సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారిందని ఐఎండి (భారత వాతావరణ కేంద్రం) (IMD) ప్రకటించింది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాలో వాతావరణ చల్లబడనుందని... పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఉత్తర అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి పోర్ట్ బ్లెయిరుకు తూర్పు ఈశాన్యంగా 110 కిలో మీటర్ల దూరాన కేంద్రీకృతమైందని ఐఎండి తెలిపింది. ఇది నేటి(సోమవారం) సాయంత్రానికి తుఫాను (ఆసనీ)గా బలపడి ఉత్తరంగా ప్రయాణించి మంగళవారం లేదా బుధవారం మాయన్మార్ తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ప్రకటించింది. 

ఆసనీ తుఫాను (cyclone asani) ప్రభావంతో ఏపీ (andhra pradesh)లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో రానున్న ఐదురోజులూ తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాలపై ఆసనీ తుఫాను ప్రభావం అంతగా లేకున్నా అండమాన్ నికోబర్ దీవులపై దీని ప్రభావం అధికంగా వుండే అవకాశం వుందట. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తీరంవెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు ఐఎండి హెచ్చరించింది. అలాగే అండమాన్ నికోబర్ దీవుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 

బంగాళాఖాతంలో ఏర్పడే ఆసని తుఫాను బంగ్లాదేశ్,మయన్మార్ దిశగా కదులుతోందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాను ప్రభావం తూర్పు, ఈశాన్య రాష్ట్రాలపై మాత్రమే వుండే అవకాశాలున్నాయని తెలిపారు. తుఫాను కారణంగా బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. 

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ మార్చి 22 వరకు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. పర్యాటకులతో పాటు స్థానిక ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. 

తుఫాను హెచ్చరిక నేపధ్యంలో గత నాలుగైదు రోజులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీవుల్లోని విపత్తు నిర్వహణ యంత్రాంగంతో ప్రభుత్వ సిబ్బంది మొత్తం అప్రమత్తమైంది.  కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు. ద్వీప సమూహంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించడంతో సహా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu