దమ్ముంటే వారాహిని టచ్ చేయండి.. నేనేంటో చూపిస్తా : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

By Siva KodatiFirst Published Dec 18, 2022, 3:28 PM IST
Highlights

వైసీపీ నేతలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన వారాహిని ఆపితే, తానేంటో చూపిస్తానని ఆయన హెచ్చరించారు. సీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నాదని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తన వారాహిని ఆపితే, తానేంటో చూపిస్తానని అధికార వైసీపీ నేతలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా దోపిడి చేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యేని తాను అంబటి అనేలోగా.. ఆయన ర్యాంబోలోగా మాట్లాడుతారని మండిపడ్డారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముందు పోలవరం ఫినిష్ చేయాలని జనసేనాని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలకు తాము భయపడేది లేదని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నాదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని పవన్ ఆరోపించారు. తాను ఎప్పుడు ఏమైనా మాట్లాడదామన్నా కొన్ని వైసీపీ గాడిదలు బయటకొచ్చేస్తున్నాయన్నారు. వైసీపీ నేతలవన్నీ పనికిమాలిన మాటలేనని.. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని పవన్ ధ్వజమెత్తారు. తనకు సినిమాలే ఆధారమని.. అంబటిలాగా కాదని ఆయన తేల్చిచెప్పారు. మీరు నోరు పారేసుకుంటే తాను కూడా నోటికి పనిచెప్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. మీరు తొక్కేస్తా మళ్లీ లేస్తానని ఆయన తేల్చిచెప్పారు. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్ పేర్కొన్నారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని.. తాను వారానికి ఓసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని జనసేనాని అన్నారు. 

Also Read: పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్:టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయింపు

విడివిడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్ పేర్కొన్నారు. 2014 లాగే కూటమిగా ఉంటే వైసీపీ గెలిచేది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారం చూడని కులాలకు అధికారం ఇచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తనను పీకేస్తే మళ్లీ మొలుస్తానని.. తొక్కేస్తే మళ్లీ లేస్తానని పవన్ అన్నారు. కొంతమందికి పదవులిస్తే బీసీలను ఉద్దరించినట్లు కాదని ఆయన చురకలంటించారు. ఎంతమంది బీసీలకు ఉద్యోగాలు ఇచ్చారని పవన్ ప్రశ్నించారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది కాపు నేతలు ఎదుగుతున్నారని జనసేనాని ఆరోపించారు. 

వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని గతంలో చెప్పానని.. దానికే కట్టుబడి వున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు బలంగా కోరుకుంటే తాను సీఎంను అవుతానని ఆయన తేల్చిచెప్పారు. ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని.. కొత్త ప్రభుత్వం రాకపోతే ఏపీ అంధకారంలోకి వెళ్తుందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. అధికారం చూడని కులాలను అధికారంలోకి ఎక్కించడమే జనసేన లక్ష్యమన్నారు. తాను తప్పు చేస్తే తన చొక్కా పట్టుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. అవసరమైతే జైల్లో కూర్చోవడానికి కూడా తాను సిద్ధంగా వున్నానని ఆయన తెలిపారు. తన సినిమాలు ఆపినా పర్లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం పోతుందనే భయంతో వైసీపీ నేతలు దాడులకు ఎక్కువగా పాల్పడతారని పవన్ చెప్పారు. వ్యూహం తనకు వదిలేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 

click me!