నా యుద్ధం నేనే చేస్తా, మమ్మల్ని బెదిరిస్తే ఏం చేస్తామో చూపిస్తాం: వైసీపీకి పవన్ వార్నింగ్

By narsimha lode  |  First Published Nov 27, 2022, 1:38 PM IST

తమ  పార్టీకి మద్దతు తెలిపేవారిని బెదిరిస్తే  చూస్తూ  ఊరుకోబోమని  జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్  చెప్పారు.  2024  ఎన్నికల  తర్వాత  చేసి  చూపిస్తామన్నారు. వైసీపీ నేతలు 175  సీట్లు గెలిచేలా  చూస్తూ  ఊరుకొంటామా  అని  పవన్  కళ్యాణ్  ప్రశ్నించారు. 
 



అమరావతి: తాను ఆంధ్రలోనే  పుట్టానని జనసేన చీఫ్  పవన్  కళ్యాణ్ చెప్పారు. తన  యుద్ధం  తానే చేస్తానని జనసేనాని  తేల్చి చెప్పారు. తాను ఈ  నేలపైనే పుట్టినట్టుగా  గుర్తు  చేశారు. వైసీపీని ఎదుర్కొనేందుకు  ప్రధానితో  చెప్పి  చేయించాలా, తాను సరిపోతానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే తానే  వస్తానన్నారు. కానీ ఢిల్లీకి  వెళ్లి బీజేపీ  మద్దతు అడగనని  పవన్  కళ్యాణ్  స్పష్టం  చేశారు. 

ఇప్పటంలో  ఇళ్లు  కోల్పోయిన  39  మందికి   ఒక్కొక్కరికి  లక్ష రూపాయాల  ఆర్ధిక సహాయాన్ని  జనసేన చీఫ్  పవన్  కళ్యాణ్  ఆదివారంనాడు  అందించారు. ఈ  సందర్భంగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.2024  ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన  చెప్పారు.హత్యా రాజకీయాలను  ప్రోత్సహించినా, బెదిరింపులకు  గురి  చేసినా  2024  ఎన్నికల తర్వాత ఏం చేయాలో చేసిచూపిస్తామని  వైసీపీకి  పవన్  కళ్యాణ్ వార్నింగ్  ఇచ్చారు.తన భవిష్యత్  అడుగులు  వ్యూహాత్మకంగా  ఉంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, సీఎంల కొడుకులే కాదు,  సామాన్యులు  రాజకీయాల్లోకి  రావాలన్నారు.2024లొ తనను  చూసి  ఓటేయాలని  ఆయన  ప్రజలను కోరారు.

Latest Videos

undefined

ఇప్పటంలో  ఇళ్లను  కూల్చి  తన  గుండెపై గునపం దింపారని పవన్  కళ్యాణ్  చెప్పారు. తాను  ప్రధాని మోడీతో  నాలుగు దఫాలు  సమావేశమైనట్టుగా  తెలిపారు. నాలుగో దఫా  విశాఖపట్టణంలో  సమావేశమైన  విషయాన్ని  ఆయన  ప్రస్తావించారు. ప్రధానితో వైసీపీపై చాడీలు  చెప్పాల్సిన  అవసరం  తనకు లేదన్నారు. ప్రధానితో తాను  ఏం  మాట్లాడానో  తెలుసుకొనేందుకు వైసీపీ  నేతలు ఆరాటపడుతున్నారన్నారు. తాను  ప్రధానితో ఏం మాట్లాడానో  మీకు  చెప్పాలా  అని  పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు. ప్రధానితో  ఏం  మాట్లాడాలో  తెలుసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆరాటం  ఎందుకని  ఆయన అడిగారు. వైసీపీని  దెబ్బకొట్టాలంటే  ప్రధానికి  చెప్పి చేయించాల్సిన  అవసరం  లేదన్నారు. దేశ  భవిష్యత్తు, సమగ్రత, సగటు  మనిషి రక్షణ గురించే  తాను  మాట్లాడుతానన్నారు. ఈ అంశాలను ప్రధానితో మాట్లాడానని  చెప్పారు. 

151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది  ఎంపీలున్నా  వైసీపీ  నేతలు  నాపై  ఎందుకు ఏడుస్తున్నారో  చెప్పాలన్నారు. వైసీపీ  నేతలు  మర్యాదగా ప్రవర్తిస్తే తాము  కూడా  పద్దతిగా  వ్యవహరిస్తామన్నారు. వైసీపీ నేతలు నీచంగా  వ్యవహరిస్తే తాము  విప్లవకారులుగా  మారుతామన్నారు. 

వచ్చే ఎన్నికల్లో175  సీట్లు  వైసీపీకి  రావాలంట... అన్ని సీట్లు  వస్తుంటే  చూస్తూ ఊరుకొంటామా  అని పవన్  కళ్యాణ్ ప్రశ్నించారు. 175  సీట్లు  వైసీపీకి వస్తుంటే తాము నోట్లో వేళ్లు పెట్టుకుని చూస్తామా అని  అడిగారు. 

30  ఏళ్లు ఏపీలో  వైసీపీని  ఎన్నుకుంటే  ఇంకా  బానిసలుగా మారతామన్నారు. తనను  ఇష్టపడిన  అభిమానులు కూడా  వైసీపీకి  ఓటేశారన్నారు. అందుకే  వైసీపీకి  151  సీట్లు  దక్కినట్టుగా  చెప్పారు. 175 సీట్లలో  వైసీపీని  గెలిపిస్తే  రాష్ట్రంలో  కూల్చని మిగిలిన  ఇళ్లను  కూల్చివేస్తారని  పవన్  కళ్యాణ్  విమర్శించారు. వైసీపీ నేతలు  తమ  భవిష్యత్తు  కోసం  30  ఏళ్లు  పాలన  కోరుకుంటున్నారన్నారు. కానీ  ప్రజలు  30  ఏళ్ల పాటు  బాగుపడాలని  తాను  కోరుకుంటున్నట్టుగా  జనసేనాని  చెప్పారు. 

 మహోన్నత  నాయుడికి, కుత్సిత భావం  ఉన్న నాయకుడికి  మధ్య  చాలా తేడా  ఉంటుందన్నారు.  ఎన్టీఆర్  తర్వాత  అంత స్థాయిలో  ప్రజలు  తమకు  పట్టం కట్టారని వైసీపీ  నేతలు  చేసే వ్యాఖ్యలపై  కూడా  ఆయన స్పందించారు. రెండు రూపాయాలకు  కిలో  బియ్యం  పథకం ప్రవేశపెట్టిన  ఎన్టీఆర్  ప్రజల  మనసుల్లో  స్థానం సంపాదించారన్నారు.  ఎన్టీఆర్ గురించి  గతంలో  గద్దర్  తనతో  చేసిన  వ్యాఖ్యలను  ఈ సందర్భంగా  పవన్  కళ్యాణ్  ప్రస్తావించారు. కళ్లులేనివారిని  వలంటీర్లతో  బెదిరించిన  చరిత్ర వైసీపీ నేతలదని పవన్  కళ్యాణ్  చెప్పారు. 

వైసీపీ నేతలు  స్వాతంత్ర్య ఉద్యమంలో  పాల్గొంటే  వైఎస్ఆర్  కడప  మాదిరిగానే వైఎస్ఆర్  ఇండియాగా  పేరు మార్చేవారని  పవన్ కళ్యాణ్  చెప్పారు.   అన్ని పథకాలకు  వైఎస్ఆర్ పేరు మార్చేవారన్నారు. ప్రతి  విషయానికి  నవ్వుతారని  పరోక్షంగా  వైఎస్  జగన్  పై పవన్ కళ్యాణ్  సెటైర్లు  వేశారు.  

ఇప్పటంలో  జాతీయ  నాయకుల  విగ్రహలను కూల్చివేశారన్నారు. కానీ  వైఎస్ఆర్ విగ్రహం  అలానే  ఉంచారని  చెప్పారు. జాతీయ  నాయకులకంటే  వైఎస్ఆర్  గొప్ప  నాయకుడు కాదన్నారు.  2024లో  జనసేనకు  మీరు  మద్దతుగా  నిలబడాలని  ఆయన  ప్రజలను కోరారు. 

also read:2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా, మాది విప్లవసేన: ఇప్పటం గ్రామస్తులకు పవన్ ఆర్ధిక సహాయం

భవిష్యత్తు  తరాలు బాగుపడాలంటే ఎవరో  ఒకరు   పోరాటం  చేయాలన్నారు. ఏపీ ప్రజల  బాగు  కోసం తాను  పోరాటం  చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్  తెలిపారు.  తనను , తన కుటుంబాన్ని చంపుతారని  అనేక  బెదిరింపులు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్  చెప్పారు. దీని వెనుక వైసీపీ నేతలున్నారన్నారు. ఈ  విషయాలన్నీ  సజ్జల రామకృష్ణారెడ్డికి  తెలుసునన్నారు. ఆశయం  కోసం  పనిచేసే వారికి  చావు  వెన్నంటే  ఉంటుందన్నారు. కానీ  ఆశయం  కోసం చనిపోయినా  బాధ  ఉండదన్నారు. ఎలాంటి పని చేయకుండా  చనిపోతే  బాధ  ఉంటుందని పవన్ కళ్యాణ్  చెప్పారు.  
 

click me!