
గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఇళ్ల కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు వుందని.. మనవారు కానివారిని తొక్కి నార తీయండి అనేలా ఏపీలో పాలన సాగుతోందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని.. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని.. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమేనని పవన్ దుయ్యబట్టారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్డు వుంటే ఇంకా విస్తరణేంటీ అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై జనసేన నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే విధించడంతో కూల్చివేతలు నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు కూల్చివేతలు పూర్తయిన సంగతి తెలిసిందే.
Also Read:మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ రోడ్డు విస్తరణ ఉద్రిక్తత... ఇప్పటంలో ఆందోళనలు
ఇకపోతే... మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి. తమ ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగగా వారికి టిడిపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. తమకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేసాకే ఇళ్ల తొలగించాలంటూ కూల్చివేత పనులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేపట్టినవారిని అదుపులోకి తీసుకున్నారు