ఎమ్మెల్సీ హత్యను కవర్ చేసేందుకే.. కోనసీమ అల్లర్లు, అంబేద్కర్ పేరు అప్పుడే పెట్టొచ్చు : పవన్ కల్యాణ్

Siva Kodati |  
Published : May 25, 2022, 02:49 PM ISTUpdated : May 25, 2022, 04:59 PM IST
ఎమ్మెల్సీ హత్యను కవర్ చేసేందుకే.. కోనసీమ అల్లర్లు, అంబేద్కర్ పేరు అప్పుడే పెట్టొచ్చు : పవన్ కల్యాణ్

సారాంశం

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్యను కవర్ చేసేందుకే కోనసీమలో అల్లర్లు , విధ్వంసం సృష్టించారని పవన్ ఆరోపించారు. 

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (ysrcp mlc ananthababu) చేసిన హత్యను కవర్ చేసుకోవడానికే కోనసీమలో గొడవ జరిగిందని జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే ఈ గొడవ వచ్చిందంటే కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టుకుని ఉండొచ్చు కదా అని పవన్ నిలదీశారు. కుల సమీకరణం మీదే రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయని.. కులాల మీదే వైసీపీ ఆట ఆడుతోందన్నారు. గొడవలు జరిగే వాతావరణం సృష్టించింది వైసీపీనే అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జిల్లాల ప్రకటన, వాటి పేర్లకు సంబంధించి కోనసీమకు కొత్త విధానం ఎందుకు అని ప్రశ్నించారు జనసేన అధినేత .

అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. అన్ని జిల్లాలకు ఒక రూల్.. కోనసీమకు కొత్త విధానం ఎందుకని పవన్ నిలదీశారు. జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్ధితి వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కడపకు వైఎస్ పేరు పెట్టడం, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం గౌరవం తగ్గించినట్లు, పెంచినట్లుగా వుందన్నారు. అమలాపురం ప్రజలు సంయమనం పాటించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. కృష్ణానది వున్న జిల్లాకు ఎన్టీఆర్  పేరు పెట్టారని.. సముద్రం వున్న జిల్లాకు కృష్ణా జిల్లా అని పేరు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని తెచ్చిన పొట్టిశ్రీరాములను జిల్లాకు పరిమితం చేయడం ఆయన గౌరవాన్ని తగ్గించినట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. మహనీయుల పేర్లు జిల్లాలకు పరిమితం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. జిల్లాకు పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం అంటే ఆ వ్యక్తులను వ్యతిరేకించినట్లు కాదని పవన్ అన్నారు. మిగతా జిల్లాలతో పాటే కోనసీమకు (konaseema district) అంబేద్కర్ పేరు పెట్టి వుంటే సహజంగా వుండేదన్నారు. గొడవలు పెట్టడానికే పేర్లపై అభ్యంతరాలకు 30 రోజులు గడువు ఇచ్చారా అని పవన్ ప్రశ్నించారు. మిగతా జిల్లాలకు ఇవ్వకుండా ఈ జిల్లా పేరు విషయంలోనే గడువు ఇవ్వడం గొడవల కోసం కాదా అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ ఉద్దేశం అల్లర్లు కోరుతున్నట్లుగా వుందని.. కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే అని పవన్ ఆరోపించారు. 

ALso REad:రౌడీ షీటర్లు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు: మంటల్లో దగ్దమైన ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్

అభ్యంతరాలను వ్యక్తులు మాత్రమే ఇవ్వాలనే షరతు కోనసీమలోనే ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే మంత్రులు, పోలీసులు  నానా హడావిడి చేస్తారని.. భావోద్వేగాలను  రెచ్చగొట్టడానికే 30 రోజులు గడువు ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మంత్రి ఇంటి (minister viswarup) మీద దాడి జరిగితే యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషించేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దాడులను అడ్డుకోవడానికి అవకాశం వున్నా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. అక్కడ ప్రజల భావోద్వేగాలు తెలిసే యంత్రాంగం సైలెంట్‌గా వుందన్నారు. అల్లర్లకు జనసేనను బాధ్యులను చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్