మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయించింది వైసీపీయే.... కోడికత్తి మాదిరిగానే : పవన్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 25, 2022, 03:17 PM ISTUpdated : May 25, 2022, 04:59 PM IST
మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయించింది వైసీపీయే.... కోడికత్తి మాదిరిగానే : పవన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కోనసీమ జిల్లా అమలాపురంలో అల్లర్లకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ల ఇళ్లపై దాడుల వెనుక వైసీపీ నేతల హస్తం వుందని ఆరోపించారు. మీ మీద మీరే దాడులు చేయించుకుని సింపతీ కొట్టేసే ప్లాన్ వేశారని పవన్ వ్యాఖ్యానించారు. 

అమలాపురంలో మీ మంత్రి, మీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించుకుంది వైసీపీ నేతలేనంటూ జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి దేశమంతా అంటుకునే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని.. గొడవలు సృష్టించి పెంచి పోషించాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీలో వున్న సజ్జల లాంటి పెద్దలు విజ్ఞతతో ఆలోచించాలని ఆయన కోరారు. యువత భావోద్వేగాలకు లోను కావొద్దని.. మీ అభిప్రాయాలు మీరు చెప్పాలని పవన్ విజ్ఞప్తి చేశారు. 

నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించినది కాదని.. కోనసీమ అంతా ఒకటిగా సంయమనం పాటించాలని ఆయన కోరారు. అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పరిమితం చేస్తామా అని పవన్ ప్రశ్నించారు. జిల్లాకు అంబేద్కర్ పేరుపై తన అభిప్రాయం ఇక్కడ అనవసరమన్నారు. భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు రెఫరెండాలు వుండటం మంచిదని.. కులాల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని అనుకుంటున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్రానికి తొలి దళిత సీఎం అయిన  దామోదరం సంజీవయ్య పేరు  కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. 

రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది కర్నూలుకు సంజీవయ్య పేరు వద్దన్నారని పవన్ ఆరోపించారు. సంజీవయ్య అంటే గౌరవం లేక కాదని.. కర్నూలు కర్నూలులాగే ఉండాలనుకున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని.. వాడుకుని వదిలేస్తున్నారని పవన్ ఫైరయ్యారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఏ ప్రభుత్వమూ అనుకోవడం లేదని.. వైసీపీకి అంబేద్కర్ మీద ప్రేమ వుంటే.. అంబేద్కర్ కోరుకున్న ఎస్సీ  సబ్‌ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని జనసేనాని నిలదీశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని పవన్ ఆరోపించారు. 

ALso Read:ఎమ్మెల్సీ హత్యను కవర్ చేసేందుకే.. కోనసీమ అల్లర్లు, అంబేద్కర్ పేరు అప్పుడే పెట్టొచ్చు : పవన్ కల్యాణ్

బొత్స నియోజకవర్గంలోని ఓ ఎస్సీ కాలనీకి సబ్‌ప్లాన్ నిధులు అందలేదని ఆయన దుయ్యబట్టారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని పవన్ ఎద్దేవా చేశారు. గొడవల వెనుక జనసేన, ఇతర పార్టీలు వున్నాయన్న హోంమంత్రి వ్యాఖ్యలకు తాము ఆశ్చర్యపోలేదన్నారు. తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే అత్యాచారాలు జరుగుతూ వుంటాయన్న హోంమంత్రి అంతకంటే ఏం మాట్లాడతారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. అమరావతిలో ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని పవన్ గుర్తుచేశారు. పోలీసులను కొట్టినా.. వైసీపీది తప్పు కాదని, జడ్జీలు తీర్పులిస్తే జడ్జీలదే తప్పంటూ జనసేనాని దుయ్యబట్టారు. 

దేశంలో దళితుల మీద జరిగిన దాడుల్లో ఏపీదే ప్రథమ స్థానం అని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారని పవన్ గుర్తుచేశారు. వైసీపీ హయాంలో ఏపీలో దళితులపై 5,857 దాడులు జరిగాయని.. కోనసీమ అల్లర్ల వెనుక డిజైన్ వుందని, గొడవలు జరగాలని వీళ్లు కోరుకున్నారని ఆయన ఆరోపించారు. కోడి కత్తి కేసు విచారణ ఎక్కడ వుందో హోంమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డిది హత్యా... ఆత్మహత్యా ఇంకా ఎందుకు తేలలేదని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు కేసుల్లో ఎందుకు విచారణ జరిపించడం లేదు..? ఎందుకు శిక్షలు పడటం లేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. మీ మీద మీరు దాడులు చేయించుకుని సింపతీ పెంచుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కులాలు కలిసి వుండాలని అనుకున్నవాళ్లమని.. తునిలో బోగీలు తగులబెట్టింది మీరే.. దాన్ని వేరే వాళ్ల మీద తోసింది మీరేనంటూ పవన్ ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్