ఎస్సీ, ఎస్టీలను రక్షించడానికే అట్రాసిటీ యాక్ట్‌.. మిగతా కులాల్ని వేధించడానికి కాదు : జగన్‌పై పవన్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 6, 2022, 10:07 PM IST
Highlights

అంబేద్కర్ తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును అడ్డగోలుగా ఉపయోగించడంపై లోతుగా అధ్యయనం చేసి, పార్టీ పి.ఏ.సి., సర్వ సభ్య సమావేశంలో చర్చిస్తామన్నారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. అందులో పవన్ మాట్లాడుతూ.. ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జశ్వంత్ అనే యువకుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే... అతనితోపాటు ఆయనకు అండగా ఉన్న మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారని జనసేనాని తెలిపారు. 

దీంతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు రాసి కేసులు పెట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సరైన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్ కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి, రిమాండు రిపోర్టును రిజెక్ట్ చేశారని ఆయన తెలిపారు. దీంతో యువకులను ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని వైసీపీ నాయకులు, పోలీసులు కసరత్తులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 

Also REad:బతికున్నంత వరకు జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయను.. గెలిచినా, ఓడినా ముందుకే : పవన్ సంచలనం

ప్రజా ప్రతినిధికి కులం, మతం అనేది ఉండదని, కులాల ముసుగులో దాక్కోకూడదని ఆయన సూచించారు. నియోజకవర్గంలో పని చేయకపోతే ప్రజలు నిలదీస్తారని..  ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా అని జనసేనాని ప్రశ్నించారు. నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగానీ, అడ్డగోలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును ఉపయోగించి వేధిస్తారా అని మండిపడ్డారు. ఈ యాక్ట్ ఎస్సీ, ఎస్టీలను రక్షించడానికి అంబేడ్కర్ తీసుకొచ్చారు తప్ప... మిగతా కులాలను వేధించడానికి కాదని ఆయన గుర్తుచేశారు. 

ఇలా అకారణంగా వేధించడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని.. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును అడ్డగోలుగా ఉపయోగించడంపై లోతుగా అధ్యయనం చేసి, పార్టీ పి.ఏ.సి., సర్వ సభ్య సమావేశంలో చర్చిస్తామన్నారు. అకారణంగా పోలీసుల వేధింపులకు గురవుతున్న తొమ్మిది మంది యువకులకు చిత్తూరు జిల్లా జనసేన నాయకులు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. 

మరోవైపు.. సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా ప్రకటించారు. జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబును ఆయన కలిశారు. తాను జనసేనలో చేరుతున్నట్లు నాగబాబుతో భేటీ తర్వాత ఆయన ప్రకటించారు. పృథ్వీరాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

తాజాగా ఆయన నాగబాబును కలిసి తన అభిమతాన్ని వెల్లడించారు. పృథ్వీరాజ్ త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు నుంచి పృథ్వీరాజ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ వైసిపిలో పనిచేస్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేశారు. దానికి ప్రతిఫలంగా జగన్ ఆయనను ఎస్వీబీసి చైర్మన్ గా నియమించారు. అయితే, ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. దాంతో ఆయనను వైసిపి నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఆయన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 

click me!