వైసీపీ జాబ్ క్యాలెండర్‌పై పవన్ అసంతృప్తి.. జూలై 20న అన్ని జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు

By Siva KodatiFirst Published Jul 16, 2021, 6:34 PM IST
Highlights

ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్‌మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని పవన్ గుర్తుచేశారు. 

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని జనసేనాని గుర్తుచేశారు. కానీ జాబ్ క్యాలెండర్‌లో కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే చూపారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపారని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన పార్టీ బాసటగా వుంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్‌మెంట్ అధికారులకు జనసేన వినతి పత్రాలు ఇస్తుందని ఆయన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని పవన్  కల్యాణ్ డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 

click me!