ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకొంటే రైతులకు నష్టపరిహారం చెల్లించొచ్చు: పవన్

By narsimha lode  |  First Published Dec 28, 2020, 5:38 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నివర్ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు 35 వేల రూపాయల పరిహారం ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు . 



అమరావతి:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నివర్ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు 35 వేల రూపాయల పరిహారం ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు . 

కృష్ణాజిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గుడివాడ , మచిలీపట్నం లలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతులకు నష్టపరిహారం చెల్లించని జగన్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Latest Videos

undefined

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భూమి హక్కులు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని, కౌలు రైతులు ఇబ్బందులు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు నష్టపరిహారం చెల్లించవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు సై అంటే మేము సై అంటాం అంటూ సవాల్ విసిరారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్లో పెట్టుకుంటారా? అమరావతిలో పెట్టుకుంటారా? లేదా పులివెందులలో పెట్టుకుంటారో తేల్చుకోవాలని అసెంబ్లీ సమావేశాలు ఎక్కడున్నా సరే, అక్కడికి వస్తామని, సమావేశాలను అడ్డుకుని తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

రైతులకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుందని, అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా సరే అడ్డుకుని తీరుతామని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతల పై విరుచుకు పడిన పవన్ కళ్యాణ్ మాట్లాడితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారని, జగన్ కు ఏ వ్యాపారాలు లేవా ? కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా ? అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా , ఒక ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీని చూసి భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

సీఎం సాబ్ కు చెప్తున్నాం.. రైతుల నష్టపరిహారం ఇవ్వాలని .. అసెంబ్లీ సమావేశాల లోపు రైతులకు 35 వేల రూపాయలు విడుదల చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అయ్యా, బాబు, సీఎం గారు అంటే మీరు పట్టించుకోవడం లేదు. రైతుల గోడు వినిపించుకోవడం లేదు. 15 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా మీలో చలనం లేదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు . రైతులకు అండగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తక్షణం రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు .


 

click me!