కాటంరాయుడు రాజుపై ఎదురు తిరిగినట్లు రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలి: పవన్ పిలుపు

Published : Feb 24, 2019, 09:32 PM IST
కాటంరాయుడు రాజుపై ఎదురు తిరిగినట్లు రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలి: పవన్ పిలుపు

సారాంశం

ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినా ఇంకా వెనుకబడిపోయిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. తాను రాయలసీమ అభివృద్ధి కోసం చివరి వరకు పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పురావాలని కోరారు. రాజకీయ మార్పురాకుంటే ఇంక సీమగతి ఇంతేనన్నారు. ఇదే  కరువు, ఇదే వలసలతో బతకాలని చెప్పుకొచ్చారు.   

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రౌడీయిజం ఎక్కువై పోయిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను  ఒక్క కులాన్ని నమ్ముకుని, ఒక్క ప్రాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కులాల గోడలు బద్దలు కొట్టడానికే వచ్చానని స్పష్టం చేశారు. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నా జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవు అని కుండబద్దలు కొట్టారు. 

సీమ బిడ్డల్లారా ఇకనైనా మేల్కోండని పిలుపునిచ్చారు. మనం ఓట్లువేసి ఇక్కడ నుంచి సీఎంలను అసెంబ్లీకి పంపించాం అయినా రాయలసీమ వెనుకబడే ఉందని చెప్పుకొచ్చారు. ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినా ఇంకా వెనుకబడిపోయిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 

తాను రాయలసీమ అభివృద్ధి కోసం చివరి వరకు పనిచేస్తానని ప్రమాణం చేశారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పురావాలని కోరారు. రాజకీయ మార్పురాకుంటే ఇంక సీమగతి ఇంతేనన్నారు. ఇదే  కరువు, ఇదే వలసలతో బతకాలని చెప్పుకొచ్చారు. 

తాను ఓటమికి బయపడనన్న పవన్ కళ్యాణ్ రాయలసీమ వెనుకబాటుతనాన్నిరూపుమాపేందుకు సైనికుడిలా పోరాడతానన్నారు. రాష్ట్రంలో తాను ఎక్కడ పర్యటించినా ప్రజలు తనను చూసి గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. ఈ కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛకోరుకుంటున్నారని తెలిపారు. ఆ స్వేచ్ఛ తనను సీఎం సీఎం అని అరిచేలా చేస్తోందన్నారు. ఏపీ రాజకీయం కొన్ని కుటుంబాల కబంధ హస్తాలలో నలిగిపోతుందన్నారు.

 రాయలసీమలో గొర్రెల కాపరి కాటంరాయుడు నెల్లూరు రాజుపై ఎదురుతిరిగి మదం అణిచాడని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అదే పరిస్థితి రావాల్సి ఉందన్నారు.మార్పు రావాలంటే తనకు జేజేలు కొట్టడం కాదని రౌడీ రాజకీయాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

అధికారం ఉన్నవారికే వ్యాపారాలు, ఉద్యోగాలు పొంది పేదలను మరింత నిరుపేదలకు మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మార్పు ఈ కొండారెడ్డి బురుజు నుంచే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu