నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లపై జనసేన, వైసిపి నాయకుల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది.
విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసిపిని ఓడించడమే లక్ష్యంగా టిడిపి, జనసేన పార్టీలు ఒక్కటయ్యాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష కూటమి... అధికార పార్టీకి మద్య మాటల యుద్దం సాగుతోంది. చివరకు పవిత్ర నవరాత్రి ఉత్సవాలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి. తాజాగా విజయవాడ దుర్గమ్మ సాక్షిగా వైసిపి, జనసేన నాయకులు పాలిటిక్స్ బయటపడ్డాయి.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వివిద అలంకరణల్లో దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ కమిటీ, అధికారులు భక్తులకు కల్పించిన సౌకర్యాలు... అమ్మవారి దర్శనం కోసం చేసిన ఏర్పాట్లను జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పరిశీలించారు. ఇందుకోసం సామాన్య భక్తుడిలా ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దుర్గమ్మను దర్శించుకున్నాడు మహేష్.
undefined
దర్శనం అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ... ఆలయ ఏర్పాట్లపై విమర్శలు చేసారు. దీంతో అతడు మాట్లాడుతుండగానే సమాచార శాఖ అధికారులు మైక్ కట్ చేసారు. అయినా మాట్లాడటం ఆపలేదు జనసేన నేత. తాను రాజకీయ విమర్శలేమీ చేయడంలేదని... భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో లోపాలను మాత్రమే ఎత్తిచూపుతున్నట్లు తెలిపారు. ఇలా పోతిన మహేష్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా పోలీసులు, ఆలయ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసారు.
Read More పవిత్ర నవరాత్రుల వేళ ఎంత అపవిత్రం..! ఇంద్రకీలాద్రిపై మందుబాటిల్స్, సిగరెట్ డబ్బాల దర్శనం (వీడియో)
ఇక జనసేన నాయకుడి వ్యాఖ్యలకు దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాలు సాఫీగా సాగుతుండగా... భక్తులు హాయిగా అమ్మవారి దర్శనం చేసుకుంటుండగా కొందరు నాయకులు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాలు చేసుకోవాలంటే కొండ దిగువన చేసుకోండి... అమ్మవారి సన్నిదిలో కాదని హెచ్చరించారు.
విజయవాడ ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడొద్దని... ఇది తెలిసి కూడా పోతిన మహేష్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నవరాత్రి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు ఆన్ లైన్ టెండర్లు పిలిచే పారదర్శకంగా నిర్వహించామన్నారు. వినాయక ఆలయం నుంచి అమ్మవారి సన్నిధానం దాకా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సూచనలిస్తే వాటిని పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తాం... అంతా సజావుగా సాగుతుంటే రాజకీయాలు చేయాలని చేయడం తగదని విజయవాడ ఆలయ ఛైర్మన్ అన్నారు.