అరగంట అద్దెఇల్లు: అంబటి తీసే MRO సినిమాకు కౌంటర్ గా జనసేన వెబ్ సీరీస్

By narsimha lodeFirst Published Aug 2, 2023, 1:11 PM IST
Highlights

మంత్రి అంబటి రాంబాబు తీయబోయే సినిమాకు  కౌంటర్ గా  వెబ్ సీరిస్ కు  కొన్ని పేర్లను పరిశీలిస్తున్నామని  జనసేన నేత పోతిన మహేష్ చెప్పారు.

విజయవాడ: మంత్రి  అంబటి రాంబాబు తీయబోయే సినిమాకు  కౌంటర్ గా  వెబ్ సిరీస్ ను  తీయాలనుకుంటున్నామని  జనసేన నేత పోతిన మహేష్ చెప్పారు. బుధవారంనాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తీయబోయే  వెబ్ సీరిస్ కు  కొన్ని  పేర్లను  పరిశీలిస్తున్నట్టుగా  పోతిన మహేష్ చెప్పారు. ఈ పేర్లను  ఆయన మీడియాకు వివరించారు. తల్లి చెల్లి ఖైదీ నెంబర్  6093, , గొడ్డలి (axe),  డాటర్ ఆఫ్ వివేకా, కోడికత్తి సమేత శీను, డ్రైవర్ డోర్ డెలివరీ,  అరగంట అద్దె ఇల్లు,  ఓ ఖైదీ వదిలిన బాణం  వంటి పేర్లను  పరిశీలిస్తున్నామన్నారు. 

పవన్ కళ్యాణ్  నటించిన  బ్రో సినిమాకు  పోటీగా  మంత్రి అంబటి రాంబాబు  ఎంఆర్ఓ  పేరుతో  ఓ సినిమాను విడుదల చేయనున్నట్టుగా నిన్న ప్రకటించారు.  అంతేకాదు  కొన్ని పేర్లను  పరిశీలిస్తున్నట్టుగా  అంబటి రాంబాబు వివరించారు.  అంబటి రాంబాబుకు  జనసేన నేత మహేష్ కౌంటరిచ్చారు. 

ఏపీ అభివృద్ధిపై  వైఎస్ఆర్‌సీపీ నేతలతో చర్చకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన  విమర్శించారు.ప్రజా సమస్యలపై  దృష్టి పెట్టకుండా సినిమాలపై  మోజు ఎందుకని ఆయన  ప్రశ్నించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులకు  సినిమాలతో  పనేంటని ఆయన అడిగారు.

బ్రో సినిమాలో  మంత్రి  అంబటి రాంబాబును పోలిన పాత్ర ఉందనే ప్రచారంలో ఉంది.ఈ అంశం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయమై  మంత్రి అంబటి రాంబాబు  జనసేనపై,పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ విషయమై జనసేన కూడ  అదే స్థాయిలో  కౌంటర్ ఇస్తుంది.

టార్గెట్ పవన్.. ఢిల్లీ వెళ్లనున్న అంబటి.. ‘‘బ్రో’’ లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు!!

అంతేకాదు  రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడ ఆయన విమర్శలు చేశారు. పోలవరం  పనులు  ఎంతవరకు  వచ్చాయని ఆయన  ప్రశ్నించారు.  రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా అని ఆయన అడిగారు.  రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పాలసీతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా చెప్పాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు.  ప్రత్యేక హోదా  కాలగర్భంలో కలిసిపోయిందని  మహేష్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యమైన కేసుల సంగతి ఏమిటో చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరే విన్పిస్తుందన్నారు.  తాను లేవనెత్తిన అంశాలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని పోతిన మహేష్ చెప్పారు.  తన సవాల్ ను స్వీకరించి చర్చకు  రావాలని మహేష్  వైఎస్ఆర్‌సీపీ నేతలను కోరారు.

 


 

click me!