ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన.. వాటిపై అధ్యయనం కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

Published : Apr 04, 2022, 12:45 PM IST
ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన.. వాటిపై అధ్యయనం కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన చేపట్టారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన చేపట్టారని విమర్శించారు. పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని తీవ్రమైన విమర్శలు చేశారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన సాగిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం... అదే హేతుబద్ధత అని చెప్పుకొంటున్న ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వారు ఎదుర్కొనే దూరాభారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. 

ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని విమర్శించారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. ఎటపాక, కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. సామాన్య, పేద గిరిజనుడు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. 

ఈ తరహా విభజన వల్ల ప్రజలకు పాలనను ఏ విధంగా చేరువ చేస్తున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ముంపు మండలాల వారికి ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు జిల్లాల  పునర్వ్యవస్థీకరణ తరవాత కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా  ఉండాలనే అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని అన్నారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఉండాలనే డిమాండ్లు ఉన్నాయని పవన్ గుర్తుచేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. డ్రాఫ్ట్ ఇచ్చే ముందు చర్చలు జరపలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన వినతులను కనీసం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతోందని పవన్ తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో లోపాలు, అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. తర్వాత వీటిని చక్కదిద్ది.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకొంటుందని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!