రాష్ట్ర బంద్ పై మౌనం: బిజెపితో పొత్తుతో పవన్ కల్యాణ్ కు కొత్త చిక్కులు

By telugu teamFirst Published Mar 5, 2021, 2:14 PM IST
Highlights

బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పవన్ కల్యాణఅ కు చిక్కులు తెచ్చిపెట్టింది.

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర బంద్ జరిగింది. ఈ బంద్ కు చంద్రబాబు నాయుకత్వంలోని టీడీపీ మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా మద్దతు ఇచ్చాయి. వైసీపీ నేతలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంద్ లో పాల్గొని వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. 

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త బంద్ కు బిజెపి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే బిజెపితో పొత్తు పెట్టుకున్న కర్మకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. బంద్ కు సంబంధించి జనసేన నుంచి ఏ విధమైన ప్రకటన కూడా వెలువడలేదు.  

విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని, ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బిజెపి రాష్ట్ర నాయకులు కూడా రాయబారం నడిపే ప్రయత్నం చేశారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడే స్థితిలో కూడా వారు లేరు. 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించి, దాని నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదనేది స్పష్టమవుతోంది. దీంతో బిజెపి రాష్ట్ర నేతలు గానీ పవన్ కల్యాణ్ గానీ మాట్లాడే పరిస్తితిలో లేరు. ఇది పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఎదురు దెబ్బనే అవుతుంది. 

ఆ ప్రభావం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కనిపిస్తూనే ఉంది. బిజెపి కండువా కప్పుకుని జనసేన నాయకులు ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  జనసైనికులు బిజెపి నేతలతో కలిసి ప్రచారానికి వెళ్లడం ేలదు. రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

ప్రత్యేక హోదా, రాజధానిని అమరావతి నుంచి తరలించడం వంటి అంశాల్లో పవన్ కల్యాణ్ తొలుత పోరాటం సాగించారు. ఆయన వల్ల ఏ విధమైన ఫలితం కూడా రాలేదు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ వాటిని వదిలేశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం పవన్ కల్యాణ్ ను పూర్తిగా చిక్కుల్లో పడేసింది. ముందుకు కదలలేని పరిస్థితిలో ఆయన పడ్డారు. 

click me!