పల్లా ఆస్తుల ధ్వంసం.. జగన్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Apr 25, 2021, 11:47 AM IST
Highlights

నిన్న గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయడం, నేడు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేయడం జగన్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 

అమరావతి: కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుండి దృష్టి మళ్లించడానికే జగన్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో భాగమే నిన్న గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయడం, నేడు విశాఖలో పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేయడమని పేర్కొన్నారు.  రేపు రాయలసీమలో ఏముంటుందో తెలీదు అంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

''విశాఖలో పల్లా శ్రీనివాసరావు భవనాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజలకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదలకు ఆరోగ్య శ్రీ, ఉద్యోగులకు హెల్త్ కార్డు పని చేయడం లేదు. ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది. అమ్ముకుని వైద్యం చేయించుకోవాలన్నా ఆస్తులను కూల్చుతున్నారు. వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఆక్సిజన్ దొరక్క, మందులు లేక, వ్యాక్సిన్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ దారి మళ్ళించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు'' అని జగన్ సర్కార్ పై చంద్రబాబు విమర్శించారు. 

read more  విశాఖలో ఉద్రిక్తత... మరో టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జీవీఎంసీ) అధికారులు కూల్చివేయడంపై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత కరోనా కష్ట సమయంలో ప్రజల ప్రాణాలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. 

''విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే టిడిపి నేత పల్లా శ్రీనివాస్ పై కక్షతో చర్యలకు దిగారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబి ప్రభుత్వం అన్నది'' అంటూ ఎద్దేవా చేశారు.

''కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధ వాతవరణంలో భవనాన్ని కూల్చివేయ్యడాన్ని,  కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా ఉండటానికి టిడిపి దేనికైనా సిద్ధమే'' అని లోకేష్ హెచ్చరించారు.        

       

click me!