జగనన్న విద్యా దీవెన: నేడు రెండో విడత నిధుల విడుదల

By narsimha lodeFirst Published Jul 29, 2021, 10:36 AM IST
Highlights

ఇవాళ జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొనేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే తొలి విడత నిధులను విడుదల చేశారు. ఇవాళ రెండో విడత నిధులను విడుదల చేస్తారు.
 

అమరావతి:  జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ నిధులను విడుదల చేస్తారు.మొత్తం 10లక్షల 97వేల మంది విద్యార్థులకు గాను 6వందల 93 కోట్ల 81 లక్షల నగదు విడుదల చేయనున్నారు ఏపీ సీఎం జగన్. నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా దీవెన అందిస్తున్నారు సీఎం జగన్.  

అలాగే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ 3నెలలకు ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. మొత్తం నాలుగు విడతల్లో జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మొదటి విడత నిధులు ఏప్రిల్‌ 19న విడుదల చేయగా ఇవాళ రెండో విడత విడుదల కాబోతోంది.

 ఇక మూడో విడత డిసెంబర్‌ నెలలోనూ, నాలుగో విడత  2022 ఫిబ్రవరి లో రిలీజ్‌ అవుతాయి. మొత్తం విద్యారంగంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 26వేల 677 కోట్ల 82 లక్షలు ఖర్చు పెట్టింది. నాడు-నేడు పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చడమే కాకుండా అందులో చదివే పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేరుతో ప్రతి ఏడాది 18వందల కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది జగన్‌ సర్కార్.


 

click me!