వైఎస్ వివేకా హత్య కేసు.. అనుమానితుడి కోసం గాలింపు..!

By telugu news teamFirst Published Jul 29, 2021, 10:35 AM IST
Highlights

విచారణలో భాగంగా నాలుగు రోజుల క్రితం వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యతో జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించిన సంగతి తెలిసిందే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు.  అనుమానితుడుగా భావిస్తున్న సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సునీల్ కుమార్ యాదవ్.. సమీప బంధువు ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

విచారణలో భాగంగా నాలుగు రోజుల క్రితం వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యతో జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన వివేకాకు అత్యంత సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను మీడియాకు వెల్లడించారు.

 అయితే విచారణ పేరుతో సీబీఐ అధికారులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని సునీల్‌కుమార్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ రోజు నుంచి పులివెందులలో సునీల్‌కుమార్‌ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు పులివెందుల వదిలి బంధువుల ఊళ్లకు వెళ్లి ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్‌ కోసం సీబీఐ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అందులో భాగంగానే పులివెందుల మండలం  ఎర్రగుడిపల్లెలో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ సమీప బంధువు యువరాజును సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతపురంలో ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి సీబీఐ అధికారులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం.

click me!