
ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయటంపై జగన్ దృష్టిపెట్టారు. రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 19, 20 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకు చెందిన నేతలను కలవనున్నారు. తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితులతో జగన్ భేటీ అవుతారు. తమకు హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం నష్టపరిహారాం ఇవ్వలేదంటూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే కదా? అందుకనే ముందు వారితో సమావేశమవుతారు.
తర్వాత ఉద్ధానం కిడ్నీ బాధితులతో పాటు వారి కుటుంబసభ్యులతో కూడా సమావేశమవనున్నారు. సమస్య మూలాలను, పరిష్కారాలపై వారితో చర్చిస్తారట. విజయనగరం జిల్లాలో సీనియర్ టిడిపి నేత వాసిరెడ్డి వరద రామారావును పార్టీలోకి చేర్చుకోనున్నారు. వాసిరెడ్డి గతంలో ఎంఎల్ఏ, ఎంఎల్సీగా పనిచేసారు. ఈయనకు సుజయ కృష్ణ రంగరావుకు పడదు. వైసీపీ లో నుండి రంగరావు టిడిపిలోకి ఫిరాయించినప్పటి నుండి వాసిరెడ్డి పార్టీ నాయకత్వంతో దూరంగానే ఉంటున్నారు. చివరకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మొత్తం ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్ధానాల్లో వైసీపీకి చెప్పుకోతగ్గ బలం లేదు. మూడు జిల్లాల్లోను కలిపి మహా ఉంటే 15 నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం జగన్ ఎప్పటి నుండో వెతుకుతున్నారు. ఇందులో భాగమే వాసిరెడ్డి చేరిక. జూలైలో ప్లీనరీ అయిపోయిన తర్వాత టిడిపి, కాంగ్రెస్ కు చెందిన గట్టి నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టారు.