వేగంగా పని చేయాలి.. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి: అధికారులను పరుగులుపెట్టిస్తున్న సీఎం చంద్రబాబు

Published : Jul 03, 2024, 10:02 AM IST
వేగంగా పని చేయాలి.. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి: అధికారులను పరుగులుపెట్టిస్తున్న సీఎం చంద్రబాబు

సారాంశం

గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలన్నారు. నూతన ఇసుక విధానం, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించడంతో పాటు అధికారులు వేగంగా పని చేయాలని నిర్దేశం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని....వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలని.....దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

కొత్త ఇసుక పాలసీ...
మొదటి సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సిఎం సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు... తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సిఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్ లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని అధికారులు అన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి, ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా నాడు ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని తెలిపారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలన్నారు. ఇసుక కొరత సమస్యను తీర్చడం, ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేనివిధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలన్నారు. దీని కోసం సమగ్ర సమాచారం, ఆలోచనలతో రావాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి అవకాశం లేని....ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీని తీసుకొస్తాం అన్నారు.

తక్షణ రోడ్ల మరమ్మతులు...
అనంతరం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానం అయితే...తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు..ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా...ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని సిఎం తెలిపారు. 

ధరల భారం తగ్గించాలి...
నిత్యవసర సరకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లై శాఖ అధికారులు, మంత్రులతో సమీక్షలో ఆయన కీలక ఆదేశాలిచ్చారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. డిమాండ్ కు సరిపడా సరఫరా లేక కందిపప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు ఆయా సరకుల దిగుమతుల కోసం అవసరమైన చోట కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుదామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 122 రైతు బజార్‌లు ఉన్నాయని అధికారులు చెప్పగా.... వాటి నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu