మీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు: చంద్రబాబుకు జగన్ షాక్

By narsimha lodeFirst Published Jun 13, 2019, 1:35 PM IST
Highlights

 మా పార్టీతో ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు  టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్యుద్దం చోటు చేసుకొంది.

అమరావతి: మా పార్టీతో ఎంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు  టచ్‌లో ఉన్నారో తన నోటితో తాను చెప్పలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అధికార, విపక్ష పార్టీల మధ్య వాగ్యుద్దం చోటు చేసుకొంది.

ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగించారు. ఈ సమయంలో పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమయంలో  స్పీకర్ జోక్యం సీతారాం జోక్యం చేసుకొన్నారు. ఈ విషయమై మరోసారి మాట్లాడుదామని  చెప్పారు.

అదే సమయంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయమై ప్రసంగించారు. గత అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలను జగన్ ప్రస్తావించారు. గత అసెంబ్లీలో తాను విపక్ష నేతగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

గత ఐదేళ్లలో  విలువలతో కూడిన రాజకీయాలను చేసిన విషయాన్ని ఏపీ ప్రజలంతా చూశారన్నారు. ఐదేళ్లలో టీడీపీ చట్టాలను తూట్లు పొడిచిందన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువులుగా కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. తమ పార్టీలో చేర్చుకొన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని ఇదే సభలో జరిగాయని జగన్ ప్రస్తావించారు.

గత ఐదేళ్లలో చంద్రబాబునాయుడు చేసినట్టుగా తాను వ్యవహరిస్తే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడ దక్కదన్నారు.  తాను డోర్ తెరిస్తే.. ఎవరూ కూడ మిగలరన్నారు. తనతో ఎందరు టచ్‌లో ఉన్నారో  తన నోటితో తాను చెప్పలేనని ఆయన సంచలనవ్యాఖ్యలు చేశారు. సభలో ప్రతిపక్షం ఉండాలని  తాను కోరుకొంటున్నట్టుగా  జగన్  చెప్పారు.

కొత్త సంప్రదాయం రావాలనేది తాను కోరుకొంటున్నట్టుగా జగన్ స్పష్టం చేశారు. తాను కొత్త సంప్రదాయాలు సభలో రావాలని కోరుకొంటే దాన్ని కూడ టీడీపీ తప్పుబడుతోందన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ అవలంభించిన విధానాలకు దేవుడు, ప్రజలు  గూబ గుయ్యుమనేలా తీర్పు ఇచ్చారని జగన్ విమర్శించారు.
 

 

click me!