ఎమ్మెల్యేలు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారో తెలుసా..?

By Galam Venkata RaoFirst Published Jun 21, 2024, 9:31 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త శాసన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు ఎలా ప్రమాణం చేస్తారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. ప్రధానంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులతో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం తొలి విడత సెషన్స్‌ నిర్వహిస్తోంది. తొలుత తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి... కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. 

Latest Videos

ఇక, తొలి అసెంబ్లీ సమావేశంలో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తర్వాత ఎమ్మెల్యేలు ఆంగ్ల అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌) లో ప్రమాణ స్వీకారం చేస్తారు. వారందరితో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు. కాగా, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాధారణ సభ్యులతో పాటే ప్రమాణం చేయనున్నారు. 

 

కాగా, శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు సహా ఎవరికీ అసెంబ్లీలోకి అనుమతి ఇవ్వలేదు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌లు జారీ నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2024 ఎన్నికలు మే 13న జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కుటమి 164 స్థానాలను గెలుచుకుని భారీ విజయం సాధించింది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాలను గెలుచుకోగా... జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుంది. ఇక, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసి.. 8 స్థానాలను గెలుచుకుంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా విఫలమైంది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ... ఈసారి 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 

click me!