Latest Videos

జగన్ జోకర్.. బాబు మేకర్.. పవన్ కింగ్ మేకర్ : ఎడిటర్స్ కామెంట్

By Venugopal Bollampalli - EditorFirst Published Jun 12, 2024, 11:54 AM IST
Highlights

ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల ముందు.. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడును పసలేని కేసులో అరెస్టు చేయడం జగన్ చేసిన ఘోరమైన తప్పిదం. వాస్తవానికి స్కిల్ డెవెలప్ మెంట్ స్కామ్ కేసు, చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరును చూస్తే.. కక్షపూరింతగా బాబును జైలుకు పంపారన్న అనుమానాలు వస్తాయి.
 

ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజలు కోరుకున్నట్లే జరిగింది. చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్‌కి రెండో సారి సీఎం అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏ పార్టీకి సాధ్యం కానంత రీతిలో అధికార పక్షాన్ని కేవలం 11 సీట్లతో మట్టి కరిపించి.. కలిసి వచ్చిన జనసేన, బీజేపీ తదితర పార్టీలతో కలిసి అతి పెద్ద విజయాన్ని నమోదు చేశారు. వాస్తవానికి ఓట్ల పర్సెంటీజీ పరంగా చూస్తే.. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ సీపీకి, తెలుగు దేశం పార్టీకి కేవలం 5శాతం మాత్రమే తేడా ఉంది. కాకుంటే జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి రావడంతో కూటమి ఓట్ల పర్సెంటీజీ దాదాపు 58 శాతానికి చేరిపోయింది. ఇది కూటమి భారీ మెజారిటీకి బాగా పనికొచ్చింది.


వాస్తవానికి చంద్రబాబు నాయుడికి ఇంత మెజారిటీ రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి చెసిన ఘోరమైన తప్పిదాలేనని చెప్పవచ్చు. ఆ తప్పిదాలు లేకుంటే వైఎస్సార్ సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా.. జనసేన పార్టీ కింగ్ మేకర్‌గా ఎదిగేది. కాకుంటే అది ఇప్పుడు జరగలేదు. 

తెలివైనవాడు ఎవడూ బాబును ఆ టైమ్‌లో అరెస్ట్ చేయడు
ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల ముందు.. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడును పసలేని కేసులో అరెస్టు చేయడం జగన్ చేసిన ఘోరమైన తప్పిదం. వాస్తవానికి స్కిల్ డెవెలప్ మెంట్ స్కామ్ కేసు, చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తీరును చూస్తే.. కక్షపూరింతగా బాబును జైలుకు పంపారన్న అనుమానాలు వస్తాయి. ఈ అరెస్టు చంద్రబాబు నాయుడుకు బాగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ముందు తెలుగు దేశం పార్టీ కేడర్ మొత్తం నిద్రావస్తలో ఉంది. మళ్లీ చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కడం అంత ఈజీ కాదనే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం.. తెలుగు దేశం పార్టీ కేడర్‌ను తట్టి లేపినట్టయింది.  బాగా యాక్టివ్ అయిపోయింది. దీనికి తోడు వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు నాయుడికి మద్ధతు పలుకుతూ.. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న కసితో పని చేశారు. తర్వాత తెలుగు దేశం, జనసేన పార్టీలు బీజేపీని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్లడంతో బాబు గెలుపు, జగన్ ఓటమి ఖరారైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడును జైలుకు పంపడంతోనే ఆయన గెలుపు ఖరారైపోయింది.

మంత్రుల నోటి దూల.. జగన్ దూల తీర్చేసింది..

కొంచెం కఠువుగానే ఉండొచ్చు. కానీ వాస్తవం ఇదే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ల మాట తీరు, అహంకారంతో కూడిన ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే వైసీపీ అభిమాన గణం తప్ప ప్రపంచంలో మరెవరూ వీరు మళ్లీ గెలవాలని అనుకోరు. వీళ్లు నోరు తెరిస్తే బూతులు, వ్యక్తిగత విమర్శలు. వీళ్ల ప్రెస్ మీట్‌‌లు వస్తే చాలు మహిళలు టీవీలు ఆపేసే పరిస్థితి. ఈ బూతుల మంత్రులు చివరకు జగన్ ‌కి చాలా నష్టం కలిగించారు. కేవలం వీళ్ల వల్లే వైఎస్సార్ సీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని అనిపిస్తోంది. వైసీపీ ఓటమి పాపమంతా వీళ్లదేనని నిర్మొహమాటంగా అనవచ్చు. 

మూడు రాజధానులే ముసలం
చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. సీఆర్‌డీయేని అభివృద్ధి చేసి.. రాజధానిని నిర్మాణానికి ప్లాన్ చేశారు. రాజధాని నిర్మాణం కావాలంటే కాస్త సమయం పడుతుంది. కేవలం అయిదేళ్లలో రాజధాని నిర్మించడం అంత ఈజీ కాదు. జగన్ తెలివైన వాడు అయితే.. అమరావతిని వేగంగా అభివృద్ధి చేసి ఉంటే.. డెవెలప్ మెంట్‌లో చంద్రబాబు నాయుడు కన్నా జగన్ మేలు అన్న భావన కలిగి ఉండేది. ఇది జగన్ను రాజకీయ రంగంలో ఓ మెట్టు పైకి ఎక్కించేది. కానీ వీళ్లు చేసింది వేరు. మూడు రాజధానులను ప్రతిపాదించి.. వైజాగ్‌ను పాలన రాజధానిగా చెప్పారు. అక్కడ అన్ని వసతులూ ఉన్నాయి వెంటనే పాలనను ప్రారంభించవచ్చని చెప్పారు. మరి వెంటనే వైజాగ్ నుంచి పాలన మొదలైందా..? లేదు. ఇక కర్నూలు.. అమరావతిలను పట్టించుకోనే లేదు. మరోవైపు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు ఇవన్నీ కలిసి మూడు రాజధానుల నిర్ణయాన్ని పిచ్చి నిర్ణయంగా మార్చేశాయి. మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల తమకు మూడు ప్రాంతాల్లోనూ ఓట్లు వస్తాయనుకున్న వైసీపీకి ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. నువ్వూ వద్దు.. నీ పిచ్చి నిర్ణయాలూ మాకొద్దని ఈ ఎన్నికల్లో అధికారం నుంచి తరిమికొట్టారు. చివరకు ఏమైంది.. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.. అమారావతే ఏపీ శాశ్వత రాజధాని అని ప్రకటించేశారు. 

నాయకులా రౌడీలా..
పైన పేర్కొన్న బూతుల మంత్రులకు తోడు కొందరు వైసీపీ నాయకులు ఇసుక తవ్వకాలు, భూ ఆక్రమణలు, ఇలా రకరకాల అంశాల్లో స్థానిక ప్రజలపై రౌడీయిజం చూపించారు. అలాగే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమికి జన్మ భూమి కమిటీ సిబ్బంది తీరు ఎలా కారణమైందో.. ఇప్పుడు వాలంటీర్లు వైసీపీకి శాపమయ్యారు. జగన్ కు ఓటేయకుంటే మీకు ఏమీ రావు.. ఎలాంటి పథకాలూ అందవు అంటూ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం వైసీపీకి రివర్స్ అయింది. చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వివాదాస్పదమై.. ప్రజల్లో తమ భూములపై జగన్ పెత్తనం ఏంటన్న ప్రశ్నలు లేవెనెత్తాయి. ఇలా ఒకటీ రెండు కాదు.. కర్ణుడు చావుకు వంద కారణాలన్నట్లు జగన్ ఓటమికి వైసీపీలో ప్రతి ఒక్కరూ వీలైనంత సాయం చేశారు. 

జగన్‌ పెద్ద జోకర్ అయ్యాడు..
ఆంధ్రప్రదేశ్‌కి రెండో ముఖ్యమంత్రి అయిన జగన్ .. ప్రెస్ మీట్ పెట్టరు. మీడియా ముందుకు రారు. పోనీ.. తన మాటలు, మాట తీరు ఏమైనా అర్థవంతంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఇటు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు మాటల్లో ఫైర్ కనిపిస్తోంటే.. జగన్ మాత్రం సోషల్ మీడియాకు పెద్ద జోకర్ లా మారిపోయాడు. చివరకు జగన్ పై వచ్చినన్ని సెటైర్లు, మీమ్స్, జోక్స్ ప్రపంచంలో ఏ నాయకుడిపైనా వచ్చి ఉండవు. అది పబ్లిక్ మీటింగ్ కావచ్చు, మీడియా రిలీజ్ కావొచ్చు జగన్ ఎక్కడ ఏం మాట్లాడినా ఆ మాటల్లో పొరపాట్లు వైరల్ అయ్యేవి. చివరకు జగన్ ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే అది వైరల్ స్టఫ్‌గా మారిపోయింది. దీనికి తోడు వైనాట్ 175, బాబాయి మరణం, సొంత తల్లీ, చెల్లి నుంచి తిరుగుబాటు ఇవన్నీ కలిసి జగన్‌కు గెలుపు కాదు సరికదా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి. 

చంద్రబాబు నాయుడపై కోటి ఆశలు
గత అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటని ఆరా తీస్తే.. బటన్ నొక్కితే అకౌంట్లలోకి వచ్చి పడే డబ్బులు తప్ప మరేదీ కనిపించదు. అత్యంత దారుణమైన రోడ్లు, పెరిగిన విద్యుత్తు బిల్లులు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు, లో-క్వాలిటీ మద్యం, రాజధాని ఏంటో చెప్పుకోలేని పరిస్థితి, గతంలో వైసీపీ ప్రధానంగా ఇచ్చిన మద్యపాన నిషేధం వంటి హామీలను నెరవేర్చకపోవడం, నిరుద్యోగ రేటు పెరగడం ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేశాయి. చివరకు ప్రత్యేక హోదా పై కూడా జగన్ పెద్దగా పోరాడింది ఏమీ లేదు. దీంతో మన జీవితం, మన భవిష్యత్తు మెరుగు పడాలంటే జగన్ వంటి అనుభవ లేమి ముఖ్యమంత్రి కన్నా దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మేలన్న అభిప్రాయం కలిగింది. దీనికి తోడు పవన్ కల్యాణ్, బీజేపీలు తోడవడంతో జగన్ కన్నా వీళ్లే నయం అని ప్రజలు నమ్మారు. వారికి అత్యంత భారీ మెజారిటీని అందించి అధికార అందలం ఎక్కించారు.


బాబు ముందున్న సవాళ్లు
ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు చాలా సంక్షోభంలో ఉంది. దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులను తీర్చాలి. వీటిని అలా మేనేజ్ చేస్తూనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. విద్యార్థులకు ఏటా 20 వేలు, 4వేల రూపాయల పింఛన్లు, మూడు సిలిండర్లు, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఇన్ పుట్ రుణాలు ఇవన్నీ అమలు చేయాలి. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో లెక్కలకు అందని అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. వాటిని బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంది. మరోవైపు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కూడా కేంద్రం నుంచి సాధించాల్సి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ బలమైన పార్టీ కావడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి మళ్లించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ప్రజలు కోరుకునేది కూడా ఇంతే. మెజారిటీ ప్రజలు, బాగా చదువుకున్న వారు మాకు బటన్ నొక్కితే వచ్చి పడే చిల్లర డబ్బులు కాదు.. కావాల్సింది బంగారు భవిష్యత్తు అంటున్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడుని ఇప్పుడు నెత్తిన పెట్టుకుకున్నారు. ఈ వచ్చే అయిదేళ్లు చంద్రబాబు నాయుడికి పెద్ద సవాలే.. ప్రతి కుటుంబానికి, ప్రతి ఓటరుకూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఇక రాష్ట్రంలో మౌలిక వసతులు, రాజధాని అభివృద్ధి ఇలా అన్నింటినీ ముందుకు తీసుకెళ్లగలిగితే మరో సారి కూడా కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైసీపీ నేతలు, వలంటీరు, వైసీపీ మంత్రుల్లాగా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారా.. మళ్లీ టీడీపీకి పుట్టగతులు ఉండవు. మరోవైపు జనసేనను కూడా ప్రజలు నమ్మరు. మొత్తానికి భారీ మెజారిటీ, అధికారం టీడీపీ, వైసీపీ పార్టీలకు కత్తిమీద సామే. ఎంత జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళితే ఈ పార్టీలకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది.

click me!