కోడికత్తి కేసులో.. కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందే... న్యాయస్థానం

By SumaBala BukkaFirst Published Jan 14, 2023, 10:37 AM IST
Highlights

కోడికత్తి కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టులో హాజరయ్యేలా చూడాలని ఎన్ఐఏ న్యాయస్థానం ఆదేశించింది. 

అమరావతి : కోడి కత్తి కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావాలని, ఆయన హాజరయ్యేలా చూడాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బాధితుడైన వ్యక్తిని  మొదటి సాక్షిగా విచారించకుండా మిగతా సాక్షులను విచారిస్తే ప్రయోజనం ఉండదని విజయవాడలోని ఎస్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. అందుకని విచారణ కోసం సిద్ధం చేసిన సాక్ష్యుల జాబితాలో బాధితుడైన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చేర్చాలని సూచించింది. 

ఈ కేసు విచారణలో ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యేలా చూడాలని ఎన్ఐఏ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న వైయస్ జగన్ పై దాడి జరిగింది. అప్పటికి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో ఓ వ్యక్తి దాడి చేశాడు. 2019 ఆగస్టు 13న దీనిమీద ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కేసులో ఎన్ఐఏ శుక్రవారం విచారణ షెడ్యూలు ఖరారు కోసం మెమో దాఖలు చేసింది. 

భోగి పండుగ వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్.. ఫుల్ జోష్‌లో..

వారు ప్రతిపాదించిన అభియోగపత్రంలో మొత్తం 56 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. దీంతోపాటు విచారణ కోసం సిద్ధం చేసిన మరో జాబితాలో పది పేర్లు పొందుపరిచారు. వీరిని విచారించడానికి షెడ్యూలు ఖరారు చేయాలని కోరారు. అయితే దీనిపై నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితుడి పేరును విచారించాల్సిన వారి జాబితాలో చేర్చలేదు ఎందుకని ప్రశ్నించారు.

మొదట పదిమంది సాక్షులను విచారించాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోరారు. దీంతో ఎన్ఐఏ తీరుపై జడ్జి ఆంజనేయ మూర్తి మండిపడ్డారు. బాధితుల సాక్ష్యం ఈ కేసులో చాలా విలువైనదని, అది లేకుండా మిగతా వారిని విచారించలేమని అన్నారు. కోర్టు టేప్ రికార్డర్ గా ఉండబోదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్ ను కూడా విచారిస్తామని వివరించారు. ఈ కేసు విచారణ జనవరి 31 నుంచి ప్రారంభిస్తామన్నారు.

ఈ కేసులో బాధితుడైన జగన్మోహన్ రెడ్డి, ఫిర్యాదుదారుడైన సిఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్ ల వాంగ్మూలాలు తమకు ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి న్యాయవాది సలీం తీసుకువచ్చారు. అయితే అభియోగ పత్రంతో పాటే ఆ వాంగ్మూలను కూడా జత చేశామని ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు తెలిపారు. కానీ అభియోగపత్రంతో పాటు ఇచ్చిన వాంగ్మూలాల్లో దినేష్ కుమార్ జగన్ సహా మొదటి 12 మంది వాంగ్మూలాలు లేవు అని సలీం తెలిపారు. దీని మీద కోర్టు ఎందుకిలా చేశారని ప్రశ్నించింది. అందరి వాంగ్మూలాలు ఉండాలి కదా అని అడిగింది. దీంతో ఎన్ఐఏ తరపు న్యాయవాది ఆ వాంగ్మూలాలన్నింటినీ నిందితుడు తరపు న్యాయవాదికి అందజేస్తామని తెలిపారు.

మరోవైపు, కోడి కత్తి కేసులో  నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. నాలుగున్నరలుగా ఆయన రిమాండ్ లో ఉన్నాడు. బెయిల్ కు అప్లై చేసుకోవడం అది తిరస్కరణకు గురవ్వడం ఇది ఏడోసారి. ఈ సారి బెయిల్ కోసం హైకోర్టుకు వెడతామని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది తెలిపారు. 

click me!