
అమరావతి: లక్షలకోట్ల ఆస్తులున్నాయన్న కారణంగానే ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవడానికి వైసిపి ప్రభుత్వం ఉబలాటపడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ) ప్రకారం దేశంలో ప్రతిఒక్కరికీ నాణ్యమైన, ఉచితవిద్యను అందించాలనే నిబంధన ఉందని... అది కేవలంప్రాథమిక హక్కే కాదు ప్రభుత్వాల బాధ్యతని అన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకంటూ సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేసారు.
''ప్రభుత్వ సహాయసహాకారాలు లేకున్నా వాటికవే స్వచ్ఛందంగా ముందుకు వెళుతున్న వ్యవస్థలనుకూడా పాలకులు కబళించాలని చూడటం బాధాకరం. aided institutes ను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం వరుసగా జీవోలు ఇవ్వడం దురదృష్టకరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ)లో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధవిద్యను అమలుచేయాలని ఉంది... అది ప్రతిఒక్కరికీ ఉన్న ప్రాథమిక హక్కు'' అని ద్వారపురెడ్డి పేర్కొన్నారు.
''ఆర్టికల్ 21(ఏ) ప్రకారం అన్నిరాష్ట్రాలు ఉచితంగా విద్యను అందించాల్సి ఉంది... కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బ్రిటీష్ వారు కూడా ఆ నిబంధన ప్రకారమే ఎయిడెడ్ విద్యావిధానాన్ని బలోపేతం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఎయిడెడ్ విద్యాసంస్థలకు అన్నిరకాలుగా సహాయసహాకారాలు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలకున్న ఆస్తులపై కన్నేసి బలవంతపు కమిటీలతో వాటిని కబళించడానికి ఆరాటపడుతోంది'' అని ఆరోపించారు.
read more ఆ ఆస్తులపై జగన్ రెడ్డి కన్ను... భారీ కుట్రకు ప్లాన్: టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ సంచలనం
''విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎయిడెడ్ సంస్థల్లోని అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 2,500 ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లేకుండాచేయడం వల్ల 2.50లక్షలమంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం కానుంది. ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలుగా మార్చడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ)కు ముమ్మాటికీ విఘాతం కలుగుతుంది'' అని జగదీశ్ వాపోయారు.
''ఎయిడెడ్ విద్యాసంస్థలైన మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోని విద్యాలయాలు, విజయవాడలోని లయోలా, గుంటూరులోని ఏసీ కాలేజ్ వంటివి లేకుండా చేయడం వల్ల ఎంతమంది నష్టపోతారనే ఆలోచన ప్రభుత్వం చేయడంలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రూ.18వేలుగా ఉన్న జీతాన్ని రూ.37వేలకు పెంచడం జరిగింది. కానీ ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని అధ్యాపకులతో టాయిలెట్లు కడిగించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ప్రభుత్వ విధానంతో, చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అమ్మఒడి మాకొద్దు, మా బడే మాకు ముద్దనే పరిస్థితి వచ్చింది'' అన్నారు.
read more ఇష్టం వుంటేనే తీసుకుంటాం.. బలవంతం లేదు: ఎయిడెడ్ స్కూల్స్ అప్పగింతపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ
''చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడుకోవడానికి మేమందరం కృషిచేస్తాం. ప్రభుత్వ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావిధానాన్ని తిరిగి యథాతథంగా రాష్ట్రమంతా కొనసాగించి తీరుతాం'' అని టిడిపి ఎమ్మెల్సీ జగదీశ్ స్పష్టం చేసారు.