
నంద్యాల ఉపఎన్నిక ఒక విచిత్ర పద్దతిలో జరుగుతోంది. ఎక్కడైనా అధికారపక్షం దాడులు చేస్తుంది. ప్రతిపక్షాలు ఎదుర్కోలేక అవస్తలు పడుతుంటాయి. కానీ నంద్యాలలో మాత్రం రివర్స్ లో జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటలతో దాడులు చేస్తుంటే టిడిపి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ చేసే విమర్శలు, ఆరోపణల ముందు చంద్రబాబునాయుడు చెప్పే అభివృద్ధి మంత్రం కానీ భూమానాగిరెడ్డి మరణంతో వస్తుందనుకున్న సానుభూతి కానీ ఎటుపోయాయో ఎవరికీ అర్ధం కావటం లేదు.
నిజానికి టిడిపి నంద్యాలలో దాదాపు రెండు నెలల క్రితమే ప్రచారం మొదలుపెట్టేసింది. అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకముందే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారం ప్రారంభించేసారు. దానికితోడు షెడ్యూల్ ప్రకటన రాకముందే చంద్రబాబునాయుడు రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించేసారు. నారాలోకేష్ తో పాటు డజను మంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఉధృతంగా నియోజకవర్గాన్ని ప్రచారంతో కమ్మేసారు. అప్పటికి వైసీపీ తరపున అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి మాత్రమే నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
టిడిపి దూకుడు చూసి ఇంకేముంది అధికారపార్టీ దూసుకుపోతోంది, ఆల్ హ్యాపీస్ అనుకున్నారు. అదే సమయంలో షెడ్యూల్ రావటం, 3వ తేదీ నంద్యాలలో వైసీపీ బహిరంగసభ జరిగింది. అక్కడి నుండి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ‘తప్పుడు హామీలిచ్చిన చంద్రబాబును నడివీధిలో కాల్చి చంపినా తప్పులేదం’టూ జగన్ చేసిన వ్యాఖ్యలతో టిడిపిలో కలకలం మొదలైంది. అక్కడి నుండి మంత్రులు, నేతలు వరుసపెట్టి జగన్ మీద విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులమీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
ఓ వారం రోజుల పాటు జగన్ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ మొన్న 9వ తేదీన నంద్యాలలో తన రోడ్డుషో మొదలుపెట్టారు. రెండో రోజు మాట్లాడుతూ ‘చంద్రబాబును ఉరితీసినా తప్పులేదం’టూ మళ్ళీ నిప్పు రాజేసారు. దాంతో యావత్ టిడిపి అంతా జగన్ చుట్టూనే తిరుగుతున్నారు. నంద్యాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లాంటి వాటిని గురించి మాట్లాడటమే టిడిపి మానేసింది. నంద్యాల పట్టణంలో మంత్రులు నిరసన ర్యాలీలే నిర్వహిస్తున్నారంటేనే పరిస్ధితి అర్దమవుతోంది. సరే, గెలుపోటములను పక్కన పెడితే మొత్తం టిడిపిని జగన్ తన చుట్టూ తిప్పుకోవటంలో మాత్రం సక్సెస్ అయినట్లే. ప్రతిపక్షం ట్రాప్ లో ఇరుక్కుని అధికారపక్షం విలవిలలాడటమే నంద్యాలలో విచిత్రం.