
రాష్ట్రంలో అభివృద్ధిని ప్రతిపక్ష వైసీపీ అడ్డుకుంటోందట. మహానాడు వేదిక మీద పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి లోకేష్ ఈరోజు మాట్లాడుతూ, వైసీపీపై మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు, రాజధాని నిర్మాణాకి, విమానాశ్రయాలకు పరిశ్రమల ఏర్పాటుకు అన్నింటికీ ప్రతిపక్షమే అడ్డని చెప్పారు. అయితే, ప్రతిపక్షం ఎంత అడ్డుపడినా తాము మాత్రం అభివృద్ధి చేయకుండా వదలరట. ఎలాగుంది లోకేష్ పంచ్.
నిజంగానే అన్నింటికీ ప్రతిపక్షం అడ్డుపడుతుంటే, గడచిన మూడేళ్ళల్లో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చెప్పుకుంటున్నదంతా అబద్దమా? లేక నిజంగానే చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు అన్నీ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షం అడ్డుపడుతున్నదని చెప్పటం అబద్దమా? ఇందులో ఏదో ఒకటే నిజం. మరి చంద్రబాబు దగ్గర నుండి లోకేష్, మంత్రులు, నేతలందరూ కట్టకట్టుకుని ప్రతీ వేదిక మీద వైసీపీ మీద ఒక విధమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు?
పట్టిసీమ లాంటి సాగునీటి ప్రాజెక్టులకు భూములు ఇవ్వద్దని వైసీపీ నేతలు రైతులను రెచ్చగొట్టారట. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొడుతున్నారట. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇవ్వద్దని రైతులను వైసీపీ నేతలే రెచ్చగొట్టారని లోకేష్ ఆరోపించారు.
పరిశ్రమలు పెట్టవద్దని, పెట్టుబడులు పెట్టొద్దంటూ వైసీపీనే ఈమెయిల్స్ పెడుతోందట. రాజధాని నిర్మాణానికి ప్లాన్ ఇవ్వదంటూ వైసీపీనే సింగపూర్ కు లేఖ రాసిందని లోకేష్ చెప్పారు. అదే విధంగా చంద్రబాబును అరెస్టు చేయమని అమెరికా పర్యటనలో ఉండగా పోలీసులకు మెయిల్ పెట్టింది కూడా వైసీపీనేట.
ఇంతటి దరిద్రపు ప్రతిపక్షం దేశం మొత్తం మీద ఇంకే రాష్ట్రంలోనూ లేదని ధ్వజమెత్తారు. అయినా 67 ఏళ్ళ వయస్సులో చంద్రబాబు కుటుంబాన్ని కూడా వదిలేసి రోజుకు 20 గంటలు రాష్ట్ర ప్రజలకోసమే శ్రమిస్తున్నారట. గతంలో తాను రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నట్లు చంద్రాబాబే చెప్పుకోగా దాన్ని లోకేష్ మరో 2 గంటలు పెంచేసారు.
చంద్రబాబు రోజుకు 36 గంటలు కష్టపడుతున్నట్లు మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఇదివరకే చెప్పారనుకోండి అదివేరే సంగతి. ఇంతకీ విషయమేమిటంటే, ఏమన్నా చేయగలిగితే దాన్ని ఘనతగాను, చేయలేకపోతే కారణం వైసీపీ మీద తోసేయటమే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.