చంద్రబాబును వెంకయ్య హెచ్చరించారా ?

First Published Feb 26, 2018, 8:32 AM IST
Highlights
  • కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

చంద్రబాబునాయుడును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయ్. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై వెంకయ్య, చంద్రబాబు మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మిత్రపక్షాలే అయినప్పటికీ బిజెపి-టిడిపిలు శతృపక్షాలకన్నా అధ్వాన్నంగా గొడవలు పడుతున్న విషయం అందరకీ తెలిసిందే. దాంతో రెండు పార్టీల మధ్య పొత్తులపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఈ నేపధ్యంలో విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్యంలో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. సదస్సుకు హాజరైన వెంకయ్యతో చంద్రబాబు మాట్లాడారు. ఆ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, కేంద్రంతో గొడవ పెట్టుకుంటే జరగబోయే నష్టంపై చంద్రబాబును హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కేంద్రంతో ఘర్షణ వైఖరిని అనుసరిస్తే సాధించేది ఏమీ ఉండదని వెంకయ్య స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను ఢిల్లీలోని పెద్దలతో చర్చించి ఇచ్చిన హామీల విషయంలో సానుకూలంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తానని కూడా హామీ ఇచ్చారట.

ఇప్పటికిప్పుడు స్నేహబంధాన్ని తెంచుకుంటే నష్టపోయేది చంద్రబాబే అన్న విషయాన్ని వెంకయ్య గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. సరే, వెంకయ్య మధ్యవర్తిత్వం వల్ల కేంద్రం-చంద్రబాబు మధ్య తలెత్తిన వివాదాలు పరిష్కారమవుతాయో లేదో తెలీదు.

కాకపోతే మొదలైన వివాదం విషయంలో వెంకయ్యకు బాగా ఇబ్బందిగా ఉందన్న విషయం మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే, వెంకయ్య-చంద్రబాబు మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. ఇటు చంద్రబాబు నష్టపోకూడదు, అటు కేంద్రంలోని పెద్దలకు ఆగ్రహం రాకూడదు. ఈ పరిస్ధితుల్లో ఏం చేయాలో వెంకయ్యకు కూడా పాలుపోవటం లేదు. మొత్తానికి చంద్రబాబుకు హామీ అయితే ఇచ్చారుకానీ వెంకయ్య మాట ఢిల్లీలో చెల్లుబాటవుతుందా అన్నదే ప్రశ్న.

click me!