
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ సినీ ప్రముఖుడి నుండి ఊహించని మద్దతు లభించింది. ఆయనే వివాదాస్పద సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ. వివిధ అంశాలపై వివాదాస్పద ట్వీట్లు చేసే వర్మ తరచూ ప్రచారంలోనే ఉంటారు. అఫ్ కోర్స్ ప్రచారం కోసమే వర్మ వివాదాస్పద ట్వీట్లు చేస్తూంటారని గిట్టని వాళ్ళు ఆరోపిస్తుంటారనుకోండి అది వేరే సింగతి.
ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే, రాష్ట్ర రాజకీయాలపై వర్మ స్పందించారు. ఏపి మ్యాప్ ఆకారం ఓ తుపాకీని పోలినట్లుంటుందని వర్మ చెప్పారు. రాష్ట్రంలోని సమస్యలసు తుపాకి పేల్చి పరిష్కరించగలిగింది ఒక్క జగన్ మాత్రమేనని ట్వీటారు. ఇప్పటి వరకూ జగన్ కు టాలీవుడ్ ప్రముఖుల నుండి బహిరంగంగా మద్దతు లేదు. అదే చంద్రబాబునాయుడు విషయం తీసుకుంటే కుప్పలు తెప్పలు. మళ్ళీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా టాలీవుడ్ బాగానే మద్దతు పలికేది.
ఎందుకనో టాలివుడ్ ప్రముఖులు మొదటి నుండీ జగన్ కు దూరంగానే ఉంటున్నారు. అదే సమయంలో జగన్ కూడా టాలివుడ్ ప్రముఖులను దగ్గర చేర్చుకోవాలనే ఆతృతను ఎప్పుడూ కనబరచలేదు. అటువంటిది వర్మ ట్వీట్టర్లో చేసిన ట్వీట్ తో జగన్ కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారా అన్న చర్చ మొదలైంది. జగన్ కు బహిరంగంగా మద్దతు పలికిన మొదటి టాలీవుడ్ ప్రముఖుడు వర్మ అనే అనుకోవచ్చా? అన్నట్లు వర్మ ఒక్క టాలీవుడ్డే కాదండోయ్ బాలీవుడ్ లోనూ ప్రముఖుడే. కాబట్టి జగన్ కు ఆలస్యంగానైనా వర్మ లాంటి ప్రముఖుడి మద్దతు లభించినందుకు సంతోషించాల్సిందే. కాకపోతే ఎవరిపై ఎప్పుడు ఎలా ట్వీటుతారో చెప్పలేనీ వర్మతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.