
‘దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల’నే సామెతను కొందరు పెద్దలు బాగానే వంట పట్టించుకున్నారు. దాంతో విచ్చలవిడిగా భూ దోడిపికి తెరలేస్తోంది. దానికి తోడు ఎన్నికలకు ఇక మిగిలింది రెండున్నర సంవత్సరాలే. అందుకే అందినకాడికి దోచుకోవటానికి ఆతృతపడుతున్నారు. గ్రూపుల మధ్య ఆధిపత్య పోరాటాలు లేదా పంపకాలు సక్రమంగ జరగక పోవటం వల్లో కారణాలేదైనా సరే విషయం బయటకు పొక్కుతోంది. ప్రభుత్వం, పార్టీ పరువు బజారున పడే సంగతి ఎలాగున్నా ఒక్కోసారి ఆధిపత్య పోరాటాల వల్ల ప్రజాధనానికి కాస్త మేలే జరుగుతున్నట్లే కనబడుతోంది.
అభివృద్ధి కార్యక్రమాల కోసం వుడా రైతుల నుండి భూసమీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ నేపధ్యంలోనే వందల కోట్ల దోపిడికి తెరలేచింది. ఇపుడదే అంశం ప్రభుత్వం, పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, భూసమీకరణలో వందల కోట్లు దోచుకోవాలని కొందరు పెద్దలు ప్లాన్ వేసినట్లు మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలే సంచలనంగా మారింది. దొంగలన్నారే గానీ ఇంతకీ ఆ దొంగలెవరో మాత్రం చింతకాయల చెప్పలేదు. అది కూడా మంత్రే చెబితే బాగుంటుంది కదా? భూసమీకరణలో చదరపు గజానికి రూ. 1400 ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించారు.
ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో విషయం రచ్చ అయింది. ఎందుకంటే రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ చేస్తున్న సమీకరణకే చదరపు గజానికి పరిహారంగా రూ. 800 చెల్లిస్తున్నారు. అలాంటిది విశాఖపట్నంలో రూ. 1400 ఇవ్వటమేమిటనేది ప్రశ్న. అయితే, తెరవెనుక కొందరు పెద్దలు చక్రం తిప్పిన కారణంగానే ఉన్నతాధికారులు రూ. 1400 నిర్ణయించారనేది తాజా ఆరోపణలు.
సరిగ్గా ఇక్కడే మంత్రి అయ్యన్నపాత్రుడు రంగం ప్రవేశం చేసారు. ముఖ్యమంత్రి, లోకేష్ తో తనకున్న సాన్నిహిత్యంతో సదరు దోపిడీని ఆపించేసారు. మీడియాతో ఇదే విషయమై అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ భూసమీకరణ పేరుతో వుడాలో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఆరోపించారు. కొందరు పెద్దలకు, ఉన్నతాధికారులు వత్తాసు పలకటం ద్వారా సుమారు 600 కోట్లరూపాయలను దొంగల ముఠా దోచుకోవటానికి అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై కలెక్టర్ లేదా సంయుక్త కలెక్టర్ చేత విచారణ జరిపించాలని కూడా మంత్రి డిమాండ్ చేయటం గమనార్హం. రాజధాని కోసం రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ఏడాది పడితే వుడా పరిధిలో మాత్రం కేవలం వారంలోనే రికార్డులు కూడా సిద్దం అవటమే దోపిడికి నిదర్శనమని మంత్రి చెబుతున్నది చూస్తుంటే కుంభకోణం నిజమేననిపిస్తోంది.