వంగవీటి రాధా టిడిపిలో చేరుతున్నారా ?

First Published Jan 17, 2018, 11:54 AM IST
Highlights
  • విజయవాడ సెంట్రల్ మాజీ ఎంఎల్ఏ, ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరుతున్నారా?

విజయవాడ సెంట్రల్ మాజీ ఎంఎల్ఏ, ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరుతున్నారా? సోషల్ మీడియా వేదికగా ఇపుడదే హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఎంత వరకూ నిజముందో తెలీదుకానీ బుధవారం ఉదయం నుండి వంగవీటి రాధా టిడిపిలో చేరుతున్నారంటూ ప్రచారం మాత్రం ఉధృతంగా  జరుగుతోంది. పైగా ఈనెల 22వ తేదీన టిడిపిలో చేరుతున్నట్లు ముహూర్తం కూడా నిశ్చయమైపోయింది.

ఒకటిమాత్రం నిజం. వైసిపి నాయకత్వంతో రాధాకు చాలాకాలంగా మంచి సంబంధాలైతే లేవు. పార్టీ కార్యక్రమాలకు రాధా దూరంగా ఉంటున్నది వాస్తవం. తప్పని పరిస్దితుల్లో మాత్రమే రాధా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకు కారణాలేంటి? అంటే, విజయవాడ సెంట్రల్ లో వచ్చే ఎన్నికల్లో రాధాకు టిక్కెట్టు ఇచ్చే విషయమై జగన్ హామీ ఇవ్వలేదట. ఇప్పటికి సెంట్రల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు పోటీ చేసిన రాధా ఒక్కసారి మాత్రమే గెలిచారు.

ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు ఉన్నారు. అలాగే, తూర్పు నియోజకవర్గానికి ఇన్చార్జిగా నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. త్వరలో వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న యలమంచలి రవికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించారట.

అంటే విజయవాడలో పోటీ చేయటానికి రాధాకు అవకాశం లేకుండాపోయింది. అందుకే జిల్లాలోని అవనిగడ్డలో పోటీ చేయమని రాధాను జగన్ కోరారట. అక్కడ పోటీ చేయటానికి ఇష్టపడని రాధా ఏకంగా పార్టీ మారటానికే నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. టిడిపిలో  చేరే ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడుతో రాధా మాట్లాడారని, టిక్కెట్టు విషయంలో తగిన హామీ లభించిన తర్వాతనే రాధా టిడిపిలో  చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది.

అయితే, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని రాధా ఎక్కడా ధృవీకరించలేదు. పైగా టిడిపి వర్గాలు ఖండిస్తున్నాయి. సరే, ఏ నేత కూడా పార్టీ మారే విషయంలో తమ ప్రయోజనాలకు హామీ వచ్చే వరకూ బహిరంగంగా అంగీకరించరన్న విషయం అందరికీ తెలిసిందే కదా? మరి, రాధా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

 

click me!