ఇద్దరు ‘చంద్రులు’ హ్యాపీయేనా

First Published Jan 17, 2018, 7:46 AM IST
Highlights
  • రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని కేంద్రం నుండి ఇద్దరు సిఎంలకు సంకేతాలు వచ్చాయని తాజాగా ప్రచారం ఊపందుకున్నది.

ఇద్దరు చంద్రులకు హ్యాపీయేనా? రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని కేంద్రం నుండి ఇద్దరు సిఎంలకు సంకేతాలు వచ్చాయని తాజాగా ప్రచారం ఊపందుకున్నది. గడచిన మూడున్నరేళ్ళల్లో ఈ విధమైన ప్రచారం జరగటం ఇదే మొదటిసారైతే కాదు. ఎప్పటికప్పుడు ప్రచారం జరగటం, నియోజకవర్గాల సంఖ్య పెరగటం లేదని కేంద్రం ప్రకటించటం మామూలైపోయింది. మళ్ళీ ఇపుడు అదే ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రాల సమస్యలు ఎలావున్నా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగటమన్నది ఇద్దరు ముఖ్యమంత్రులకు చాలా అవసరం. నియోజకవర్గాలు పెరుగుతాయన్న ఆశను చూపించే తెలంగాణా, ఏపి ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబునాయుడు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారన్నది వాస్తవం. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య గనుక పెరగకపోతే అప్పుడు మొదలవుతుంది వాళ్ళిద్దరికీ సినిమా.

నియోజకవర్గాల సంఖ్య గనుక పెరగకపోతే రెండు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు 60 నియోజకవర్గాల్లో అధికారపార్టీలకు ఇబ్బందులు తప్పవు. అలకలు, తిరుగుబాట్లు, పార్టీలు మారటాలు ఇలా.. ఏదో ఒకరకంగా అధినేతలకు తలనొప్పులు తప్పవు. అందుకని అన్నీ సమస్యలను పక్కనబెట్టి కేవలం నియోజకవర్గాల సంఖ్య పెరగటంపైనే ఇద్దరూ ప్రధాన దృష్టి పెట్టారు. మిగిలిన సమస్యలపైన కూడా మాట్లాడుతున్నప్పటికీ ఇద్దరికీ తక్షణ సమస్య మాత్రం నియోజకవర్గాల సంఖ్య పెరగటమే.

తెలంగాణా, ఏపితో పాటు మరికొన్ని రాష్ట్రాల నుండి కూడా నియోజకవర్గాల సంఖ్య పెరగటంపై కేంద్రపై ఒత్తిడి పెరుగుతోందట. నియోజకవర్గాలు పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. మరి, తెరవెనుక ఏమి జరిగిందో స్పష్టంగా తెలీదు. నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు కేంద్రహోంశాఖ సిద్ధం చేసి ప్రధాని కార్యాలయానికి పంపిందంటూ ప్రచారం మొదలైంది.

ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెంచటం నిజమే అయితే, తెలంగాణాలో ప్రస్తుతమున్న సంఖ్య 119 నుండి 153కు పెరుగుతాయి. ఏపిలో 175 నియోజకవర్గాలు 225కి పెరుగుతాయి. ఒకవైపేమో అసెంబ్లీ సంఖ్య పెంచటం వల్ల టిడిపికి తప్ప తమకేమీ ఉపయోగం లేదని గతంలోనే భాజపా నేతలు పలుమార్లు జాతీయ నాయకత్వానికి చెప్పారు. అందువల్లే కేంద్రం కూడా ఈ విషయంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ తాజాగా అదే అంశంపై ప్రచారం ఊపందుకోవటంతో ఈసారి ఏమవుతుందో చూడాలి.

 

 

click me!