
తెలుగుదేశంపార్టీలోని ఇద్దరు సీనియర్లకు నాయకత్వం పొమ్మనకుండానే పొగపెడుతోందా? టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అదే అనుమానాలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరు పార్టీలో సీనియర్లే కాకుండా ఎంఎల్సీలు కూడా. ఇదంతా ఎవరి గురించంటే కర్నూలు జిల్లాలోని శిల్పా మోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లాలోని కరణం బలరాం గురించే. ఇద్దరికీ కూడా ఒకేసారి పార్టీలో ఉండలేని పరిస్ధితులు ఎదురవుతుండటం విచిత్రం.
చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇటువంటి నేపధ్యంలోనే నంద్యాల ఉపఎన్నిక జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత స్వయంగా చంద్రబాబే ఎదుర్కొన్నారు. ఒకవైపు ఉపఎన్నికలో గెలవటానికి టిడిపి నానా అవస్తలు పడుతోంది. ఇంకోవైపు పార్టీలోని నేతలను చంద్రబాబు దూరం చేసుకునేట్లుగా వ్యవహరిస్తుండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
నంద్యాల ఎన్నికలో శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్ధి కావటంతోనే చక్రపాణికి ఇబ్బందులు మొదలయ్యాయి. చంద్రబాబుతో సహా జిల్లాలోని నేతలెవరూ చక్రపాణి రెడ్డిని నమ్మటం లేదు. పైగా చక్రపాణిరెడ్డిని వైసీపీ అభ్యర్ధికి కోవర్టుగా అనుమానిస్తున్నారు. దాంతో ఎంఎల్సీకి బాగా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్ధితి చూస్తుంటే శిల్పా మోహన్ రెడ్డి గెలచినా, ఓడినా చక్రపాణిరెడ్డి మాత్రం టిడిపిని వదలక తప్పదనే అనిపిస్తోంది. ముహూర్తం ఎప్పుడన్నదే తేలాలి.
ఇక, ప్రకాశం జిల్లాలో కరణం బలరాం పరిస్ధితి కూడా సేమ్ టు సేమ్. ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ దెబ్బను కరణం తట్టుకోలేకున్నారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల తరబడి పోరాటాలు నడుస్తున్నాయి. ఇద్దరూ మొన్నటి వరకూ చెరో పార్టీలో ఉండేవారు. అటువంటిది పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన గొట్టిపాటిని చంద్రబాబు పట్టుబట్టి టిడిపిలోకి లాక్కున్నారు. అప్పటి నుండి కరణంకు సమస్యలు మొదలయ్యాయి.
ఇరు వర్గాలు ఒకరిపై మరో వర్గం దాడులు చేసి హత్యలు చేసుకునేదాకా వెళ్లింది పరిస్ధితి. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా, గురువారం జరిగిన అద్దంకి నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ, అద్దంకిలో గొట్టిపాటిదే ఫైనల్ అని తేల్చేసారు. తన మాట వినకపోతే కరణంపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అంటే గొట్టిపాటి కోసం కరణంను వదులు కోవటానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారనే సిగ్నల్స్ నేతలకు వెళ్ళింది. అంటే, త్వరలో కరణం కూడా పార్టీని వదిలేసే రోజు ఎంతో దూరంలో లేదన్న ప్రచారం మొదలైంది. దీనిబట్టి చూస్తుంటే ఇద్దరు ఎంఎల్సీలను పొమ్మనకుండానే పొగపెడుతున్నట్లుగా లేదూ?