
వైసీపీని బలహీనపరిచేందుకు చంద్రబాబునాయుడు రూటు మార్చారా? అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. ఇప్పటి వరకూ వైసీపీకి చెందిన ఎంఎల్ఏలను ప్రలోభాలతో లాక్కున్నారు. అయితే, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని చంద్రబాబుకు అర్ధమైనట్లుంది. అందుకనే ఎంఎల్ఏల బదులు ద్వితీయశ్రేణి నేతలను పార్టీలోకి చేర్చుకుంటేనే ఎక్కువ ఉపయోగాలుంటాయని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
21 మంది వైసీపీ ఎంఎల్ఏలను లాక్కున్నా ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలతో వారికి పడటం లేదు. దాంతో పార్టీలో ఎప్పుడూ గొడవలే అవుతున్నాయి. వారిమధ్య పంచాయితీలు తీర్చటం చంద్రబాబు వల్ల కావటం లేదు.
ప్రకాశం జిల్లాలోని మార్టూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, కడప జిల్లాలోని జమ్మలమడుగు తదితర నియోజకవర్గాల్లో జరుగుతున్న గొడవలు అందరూ చూస్తున్నదే. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ నియోజకవర్గాలు కుడా పెరగవని తేలిపోయింది. దాంతో టిడిపి గాలమేస్తున్నా ఫిరాయించటానికి వైసీపీ ఎంఎల్ఏలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే ఫిరాయింపులు ఊపందుకోవటం లేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనుకున్న ఎంఎల్ఏల నియోజకరవర్గాల్లో మాత్రం వైసీపీ ఎంఎల్ఏలను చేర్చుకోవాలని చంద్రబాబు అనుకున్నారట.
ఎంఎల్ఏలను లాక్కునే బదులు నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకోవటం వల్లే ఎక్కువ లాభం ఉంటుందని అనుకుంటున్నారట. ఎందుకంటే, ద్వితీయశ్రేణి నేతలకైతే టిక్కెట్ల సమస్య ఉండదు. పదవులు లేదా ఆర్ధిక అవసరాలను గమనించుకుంటే సరిపోతుందని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇదే పద్దతిని నంద్యాలలో చంద్రబాబు అమలు చేసి సక్సెస్ అయ్యారు.
అందుకు రెండంచెల విధానాన్ని అవలంభించాలని అనుకుంటున్నారు. మొదటి: టిడిపి బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోని వైసీపీ ద్వితీయశ్రేణి నేతలను చేర్చుకోవటం. ఇక రెండోది: వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోని నేతలపైన దృష్టి సారించటం. అంటే పై రెండు పద్దతుల్లో కుడా వైసీపీ ఎంఎల్ఏలకన్నా ద్వితీయశ్రేని నేతలను లాక్కుంటేనే ఎక్కువ ఉపయోగమని చంద్రబాబు అనుకుంటున్నట్లు కనబడుతోంది. రాష్ట్రం మొత్తం మీద నంద్యాల ఫార్ములానే అమలు చేయాలని చంద్రబాబు పదే పదే చెప్పటంలో అర్ధమిదేనేమో?