
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నోరెత్తనీయకూడదన్నదే టిడిపి లక్ష్యంగా కనబడుతోంది. అవకాశం ఉంటే అసలు సభలోకే రానీయకూడదని కూడా అధికారపార్టీ సభ్యులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు లేండి. గడచిన రెండు రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అధికారపార్టీ వ్యూహం స్పష్టమవుతోంది. కొత్త అసెంబ్లీలోనైనా సమావేశాలు అర్ధవంతంగా జరుగుతాయని ఆశించిన వారికి టిడిపి వైఖరి మింగుడుపడనిదే. దీనికంటే హైదరాబాద్లోని అసెంబ్లీయే నయంలాగుంది. ప్రత్తిపాటి మీద జగన్ చేసిన ఆరోపణలు, తదనంతర పరిణామాలతో అసెంబ్లీ రెండు రోజుల నుండి దద్దరిల్లిపోతోంది. మంత్రిమీద ఆరోపణలు వస్తే వాటిని తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అంతేకానీ ఆరోపణలు చేసిన సభ్యుడిని సభ నుండి వెలేయటమన్నది గతంలో ఎన్నడూ లేదు. ఆ సంప్రదాయానికి చంద్రబాబునాయడే శ్రీకారం చుట్టారు.
గతంలో కూడా చంద్రబాబు మొదలుకుని ఎందరో నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైన కాంగ్రెస్ మంత్రులపైన ఎన్నో ఆరోపణలు చేసారు. అప్పుడెప్పుడూ ఈ పద్దతిలో ఆ ప్రభుత్వాలు షరతులుపెట్టలేదు. అసలు మంత్రిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం షరతులు పెట్టటమేమిటో అర్ధం కావటం లేదు. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపణైతే ప్రజల్లో జగనే విశ్వసనీయత కోల్పోతారు. అదేసమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కూడా మంచి పేరొస్తుంది కదా? మరి అంత మంచి అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు జారవిడుచుకుంటోంది?
కారణం సింపుల్. షరతులతో కూడిన విచరణకు ఏ ప్రతిపక్షమూ విచారణకు అంగీకరించదన్న సంగతి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు తెలియనిది కాదు. తెలిసీ అదే సవాలును పదే పదే సభలో ప్రస్తావించటంలో అర్ధమేమిటి? జగన్ను సభలో నోరెత్తనీయకుండా చేయటమే. అంటే, తమ షరతుకు జగన్ అంగీకరించే వరకూ అసెంబ్లీలో జగన్ను మాట్లాడనీయకూడదని అధికారపక్షం గట్టిగా నిర్ణయించుకున్నది. ఇలా ఎన్నిరోజులంటే ఈ రోజు చంద్రబాబు లేదా జగన్ తీసుకోబోయే వైఖరిపై ఆధారపడివుంటుంది. సభలో గడచిన రెండు రోజుల నుండి జరుగుతున్న గందరగోళానికి కారణం అదే. ఎవరి వాదనకు వారు కట్టుబడి వుండటమే గందరగోళానికి ప్రధాన కారణం. పైగా ఇరు వైపులా సవాళ్ళు-ప్రతిసవాళ్లతో సభలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తినపుడు ఇరు పార్టీలను శాంతిపచేయాల్సిన స్పీకర్ కూడా అగ్నిలో ఆజ్యంపోస్తుండటం గమనార్హం.
సమావేశాలు సజావుగా సాగాలంటే ఒకటే మార్గం. అసెంబ్లీ నుండి జగన్ లేదా మంత్రి ప్రత్తిపాటి వెలికి తాను సిద్ధమని జగన్ అంగీకరించాలి. లేదా తాను చేసింది తప్పుడు ఆరోపణలనైనా అంగీకరించాలి. మరి రెండింటిలో జగన్ దేనికి ఒప్పుకుంటారు? రెండోదానికైతే అంగీకరించే సమస్యే లేదు. మరి ‘వెలి’కన్నా అంగీకరిస్తారా? అంగీకరించేట్లయితే బుధవారమే అంగీకరించేవారు కదా? సభలో ఇంత గందరగోళం ఎందుకు? మరేం చేస్తారు జగన్. ఆ విషయంలోనే పార్టీలో మల్లగుల్లాలు పడుతున్నారు. చూద్దాం ఈరోజు సభలో ఏం మలుపులు తిరుగుతుందో.