
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. మరి ఆ ప్రశ్నలకు ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది వేరే సంగతి. అసెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితులపై రెండు రోజులుగా గొడవులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా? ఆ నేపధ్యంలోనే జగన్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి ప్రభుత్వం బాధితుల కష్టాన్ని ఎందుకు తీర్చటం లేదంటూ సూటిగా ప్రశ్నించారు. సంస్ధకున్న హాయ్ ల్యాండ్ తో పాటు ఇతరత్రా భూములు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లను వేలం ద్వారా ఎందుకు అమ్మటం లేదని నిలదీసారు.
అగ్రిగోల్డ్ అన్నది పెద్ద స్కాంగా జగన్ వర్ణించారు. అందులో చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ కు కూడా భాగముందన్న ఆరోపణలను జగన్ ప్రస్తావించారు. పనిలో బాధితుల పక్షాన నిలబడినందుకే తనను సభలో ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా జగన్ వివరించారు. దేశంలోని పెద్ద కుంభకోణాలన్ని పార్లమెంట్ లో చర్చలు జరగటం ద్వారానే బయటపడ్డాయన్న విషయం చంద్రబాబుకు తెలీదా అంటూ ప్రశ్నించారు.
పనిలో పనిగా 21 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలపైన కూడా జగన్ చంద్రబాబును నిలదీసారు. 21 మంది ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించి వెంటనే ఉప ఎన్నికలు పెట్టించాలని డిమాండ్ చేసారు. అందులో మెజారిటీ స్ధానాలు గనుక వైసీపీ గెలిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ సవాలు విసిరారు. అదే సమయంలో అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రత్తిపాటి భార్య వెంకాయమ్మ పేరుతో కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను కూడా జగన్ మీడియాకు అందించారు. గడచిన మూడేళ్ళుగా తాము చేసిన అన్నీ ఆరోపణలపైనా ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేయటం గమనార్హం.