
టిడిపి నేతలకేమన్నా ప్రత్యేక చట్టాలేమన్నా ఉన్నాయా? మూడేళ్ళుగా అధికార పార్టీలో కొందరు నేతల వ్యవహారాలు చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు నేతలు అధికారులను బహిరంగంగానే కొడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళల్లోను, కళాశాలల్లోనూ చదువుతున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రశ్నాపత్రాలు లీకవుతాన్నాయని గగ్గోలు పెడుతున్నా విచారణలు లేవు. ప్రభుత్వ ఆస్తులను కుదవపెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా చర్యలు ఉండవు. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి టిడిపి నేతల రోతపనులు.
ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వ పరంగా ఎవ్వరిపైనా ఎటువంటి చర్యలు ఎందుకు ఉండటం లేదన్న అనుమానమే అందరినీ పీడిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా చేసినపుడు చంద్రబాబునాయుడుకు మంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నారు. ఇపుడు ఆయనలోని పాలనాధక్షత ఏమైందో అర్ధం కావటం లేదు. ఒకపుడు ఎవరైనా తప్పు చేస్తే కాస్త కఠినంగానే ఉండేవారు. అటువంటిది ఇపుడు పలువురు నేతలు బరితెగుస్తున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులు ప్రభుత్వ భూములే తమవిగా చెప్పుకుని బ్యాంకుల్లో రూ. 400 కోట్లకు కుదవపెట్టేసారు. సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. అయినా చర్యలు లేవు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో నెల్లూరు స్ధానిక సంస్ధల్లో పోటీ చేసిన టిడిపి అభ్యర్ధి వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులకు ఏకంగా రూ. 400 కోట్లు టోకరా వేసారట. ఇక, మంత్రికి చెందిన కార్పోరేట్ స్కూళ్ళు, కళాశాలల్లో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంతవరకూ ఎవ్వరిపైనా చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు విచారణ జరిపిస్తున్నామని మత్రం చెబుతున్నారు. మరి ఏం విచారణ జరుగుతోందో తెలీటం లేదుగానీ ఆత్మహత్యలైతే జరుగుతూనే ఉన్నాయ్.
ఇపుడు జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయని విద్యార్ధులు, తల్లి, దండ్రులు గోల చేస్తున్నారు. అయినా పట్టించుకోవటం లేదు. ఆమధ్య రాష్ట్రాన్ని కుదిపేసిన ‘కాల్ మనీ సెక్స్ రాకెట్’ లాంటి దందాలు బహిరంగంగానే జరుగుతున్నా పోలీసులు ఎవరిపైనా ఎందుకు చర్యలు తసుకోవటం లేదని అనుమానాలు కలుగుతున్నాయ్. మహిళలపై నేరాలు 11 శాతం పెరిగినట్లు స్వయంగా డిజిపినే వెల్లడించిన విషయం గమనార్హం. ఇదే విషయమై సిపిఐ కార్యదర్శివర్గ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు దాడులు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రవాణా కార్యదర్శి బాలసుబ్రమణ్యంపై ధౌర్జన్యానికి పాల్పడిన ఎంపి, ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేసారు. జరుగుతున్నవన్నీ చూస్తుంటే టిడిపి ప్రజాప్రతినిధులు, నేతలు ఎవరినేమి చేసినా అడక్కూడనేందుకు ప్రత్యేక చట్టాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.