
తెలుగుదేశంపార్టీ అసంతృప్తులకు కర్నూలు జిల్లానేత శిల్పా మోహన్ రెడ్డి మార్గదర్శనం చేసారు. వివిధ కారణాల వల్ల చంద్రబాబునాయుడుపై అసంతృప్తితో ఉన్న నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలో తేల్చుకోలేక ఇంతకాలం సతమతమవుతున్నారు. అటువంటి వారిలో అత్యధికుల వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫిరాయింపు ఎంఎల్ఏలున్న 21 నియోజకవర్గాల్లోని టిడిపి అసంతృప్తులే ఎక్కువ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లుంది. అధికారపార్టీని వదిలేసి ప్రతిపక్షంలోకి వెళ్ళటానికి ఎవ్వరూ సాహసించరు. ప్రతిపక్షంలో ఉన్నవారినే ప్రభుత్వం ఏదో ఒకరకంగా వేధింపులకు గురిచేస్తోంది. అటువంటిది టిడిపి నుండి ప్రతిపక్షంలోకి వెళితే ఇంకేమన్నా ఉందా?
వేధింపులే కాకుండా ఇతరత్రా అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమలో ఎంత అసంతృప్తున్నా ఎవ్వరూ పార్టీ మారే సాహసం చేయటం లేదు. అటువంటి వారికి శిల్పా మార్గదర్శనం చేసారు. నంద్యాల టిక్కెట్టు విషయంలో చంద్రబాబు ధోరణి నచ్చకే శిల్పాకు టిడిపికి గుడ్ బై చెప్పేసారు. పార్టీ మారితే తనపై వేధింపులుంటాయని తెలిసే తాను పార్టీ మారినట్లు స్పష్టం చేసారు. అన్నింటికీ ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు.
టిడిపిని వదిలేస్తే ఏమవుతుందో అని భయపడుతున్న నేతలందరూ శిల్పా పార్టీ మారిన విషయాన్ని స్పూర్తిగా తీసుకునే అవకాశం ఉంది. టిడిపిలో అసంతృప్తులకు కొదవ లేదు. ఒక్క ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాలే కాకుండా చాలా చోట్ల ఇదే పరిస్ధితి. ఒకవైపు ఎన్నికలేమో దగ్గరకు వస్తున్నాయ్. ఇంకోవైపు చంద్రబాబు ఎవరికి టిక్కెట్టు ఇస్తారో కూడా తెలీదు. ప్రతీ విషయంలోనూ నాన్చుడు వ్యవహారమే. దాంతో నేతలు కూడా బాగా విసిగిపోయున్నారు. కానీ ఏం చేయలేకున్నారు.
పలు నియోజవకర్గాల్లోని టిడిపి నేతలు ఎన్నికల ముందు తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఒకవైపు జగన్ ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసేస్తున్నట్లు సమాచారం. దాంతో టిడిపిలో ఉండలేక, బయటపడలేక అవస్తలు పడుతున్నారు. అటువంటి వారికి శిల్పా మోడల్ గా నిలిచారు. ఇదే విషయమై శిల్పా మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో చాలామంది నేతలు టిడిపిని వదిలేందుకు సిద్ధంగా ఉన్నారని చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.