
చంద్రబాబునాయుడు పాలన ఇలాగే ఉంటుంది. భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలే అందుకు ఆధారాలు కూడా ఇవ్వాలట. ప్రతిపక్షాలే ఆరోపణలు చేసి ఆధారాలు కూడా ఇస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుందట? ఈరోజు రెవిన్యూశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చేసిన ప్రకటనే విచిత్రంగా ఉంది. ప్రజలకు మేలు జరగాలని ప్రతిపక్షాలు అనుకుంటే అనవసర రాద్దాంతం మానేయాలట. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయట. అంటే కెఇ ఉద్దేశ్యంలో అసలు భూకుంభకోణమే జరగలేదనా?
ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మంత్రివర్గం సభ్యుడు, విశాఖజిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా చెప్పారు. ప్రభుత్వ భూములకు చెందిన రికార్డలు ట్యాంపరింగ్ జరిగినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ధృవీకరించారు. భూకుంభకోణం జరిగిందనటానికి ప్రభుత్వానికి ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి? ట్యాంపర్ చేసిన అధికారులను విచారిస్తే ఎవరికోసం ట్యాంపరింగ్ చేసామో అధికారులు చెప్పరా? వేలాది ఎకరాలు పచ్చ పార్టీ నేతల సొంతమైందంటే ఏస్ధాయిలో అధికార దుర్వినియోగం జరిగిఉండాలి?
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల ప్రకారం కుంభకోణం విలువ సుమారు రూ. 3 లక్షల కోట్లు. అంత కాకపోయినా ఎంతో కొత జరిగిందన్నది వాస్తవం. మొత్తం కుంభకోణంలో టిడిపి నేతల పాత్ర లేదంటే ఎవరైనా నమ్ముతారా? వైసీపీ ఆరోపణల ప్రకారం మంత్రి గంటా శ్రీనివాస్ రావు, ఐదుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీతో పాటు పలువురు నేతలు లబ్దిదారులు.
ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకే అధికారులు రికార్డులను ట్యాంపర్ చేసారన్నదాంట్లో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. కాకపోతే ఎవరి ఆదేశాల మేరకు అధికారులు ట్యాంపర్ చేసారో తేలాలి. జరిగిన కుంభకోణంపై కొద్ది రోజులుగా నానా రాద్దాంతం జరుగుతున్నా చంద్రబాబు మాత్రం నోరు ఎందుకు మెదపటం లేదు? తన పాలన పారదర్శకమని, తాను నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు సిబిఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు?