ఏపీలో ఇసుక ఉచితమా.. ఈ కన్‌ఫ్యూజన్‌ ఏంటి?

By Galam Venkata Rao  |  First Published Jul 9, 2024, 6:33 PM IST

సాధారణంగా ఉచితం అంటే అంతా ఫ్రీనే అనుకుంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ మాత్రం అలా లేదు. నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో అయితే టన్ను ఇసుక రూ.1,225కి అమ్ముతున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.


ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఓ వైపు ఉచితం అంటూనే చార్జీలు బాదేస్తున్నారని... ఇసుక రీచ్‌లలో రేట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు యూ టర్న్‌ రాజకీయాల్లో ఇదొకటని విమర్శిస్తున్నారు. నెల రోజులు తిరగక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, ‘‘08.07.2024 నుండి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఇసుక స్టాక్ యార్డుల్లో ఉచిత ఇసుక విధానం పునః ప్రారంభించబడుతుంది. సరఫరాలు స్థిరీకరించబడే వరకు ప్రతి వినియోగదారుడు గరిష్టంగా రోజుకు 20 మెట్రిక్ టన్నులు పొందేందుకు అనుమతించబడతారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా చేయబడుతుంది. పాలసీ ప్రకారం, ఆన్లైన్ చెల్లింపు ద్వారా కార్యకలాపాల ఖర్చు, చట్టబద్ధమైన లెవీలు, పన్నులు మినహా ఎటువంటి ఆదాయ వాటాను వసూలు చేయకుండా ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.’’ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 

Latest Videos

సాధారణంగా ఉచితం అంటే అంతా ఫ్రీనే అనుకుంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ మాత్రం అలా లేదు. నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో అయితే టన్ను ఇసుక రూ.1,225కి అమ్ముతున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఉన్న అగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకను రూ.1394కు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ధరల్లో కాస్త అటుఇటుగా వ్యత్యాసం ఉంది. ఇదే టన్ను ఇసుకను వైసీపీ హయాంలో టన్ను రూ.1,400 చొప్పున విక్రయించారు. అయితే, గత ప్రభుత్వం కంట కాస్త రేటు తగ్గినప్పటికీ... ఉచితం అని హామీ ఇచ్చాక మళ్లీ ఫీజులేంటన్నదే ప్రశ్న. కన్‌ఫ్యూజన్‌.

రకరకాలుగా వసూళ్లు...

సీనరేజీ, లోడింగ్, ట్రాన్స్ పోర్టు, ర్యాంప్ నిర్వహణ, అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్, డీఎంఏ, మెరిట్ ఫీజులు, జీఎస్టీ పేరుతో ప్రస్తుతం ఇసుకకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో సీనరేజీ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తున్నారు. తవ్వినందుకు రూ.30 చొప్పున, బోట్స్‌మెన్‌ సొసైటీలు అయితే టన్నుకు రూ.225 తీసుకుంటున్నారు. రీచ్‌ నుంచి డంప్‌కు తరలిస్తే రవాణా ఖర్చు కింద కిలోమీటరుకు రూ.4.9ల చొప్పున వసూలు చేస్తారు. నిర్వహణ ఖర్చు కింద మరో రూ.20 ఉంటుంది. వీటన్నిటికీ 18శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కలిపి టన్నుకు రూ.రూ.1,225 నుంచి సుమారు రూ.1400కి వసూలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు గత ప్రభుత్వానికి, ప్రస్తుతానికి తేడా ఏముంది...? ఇప్పుడు ఇసుకను అమ్ముతున్నట్లా..? ఫ్రీగా ఇస్తున్నట్లా..?

ఉచితం అన్నప్పుడు ఇలా రకరకాలుగా వసూలు చేయడమేంటని ప్రభుత్వాన్ని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ ఉచితమని ఎలా చెబుతారని నిలదీస్తోంది. ప్రజలకు విపరీతంగా హామీలిచ్చి గెలిచిన తర్వాత తుంగలో తొక్కడం చంద్రబాబు నైజమని విమర్శిస్తోంది. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రేట్లతో గతంలో తమ ప్రభుత్వం ఇసుక విక్రయిస్తే రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.750 కోట్లు ఆదా వచ్చింది. అంటే ఐదేళ్లలో రూ.3,750 కోట్ల ఆదాయం. 

క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు...

వైసీపీ విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇంతకంటే పారదర్శకమైన ఇసుక పాలసీ మరొకటి ఉండదన్నారు. ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు, రాజకీయాలు చేయడం తగదన్నారు. ఉచిత ఇసుకంటే నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తామన్నట్లు కొందరు మాట్లాడుతున్నారని... ఏ నదిలో అయినా, కాలువలో అయినా ట్రాక్టర్ లేదా ఎడ్లబండితో ఇసుక ఉచితంగా తీసుకెళ్లొచ్చని.. ఎవరూ అడ్డుకోరని స్పష్టం చేశారు. 

 

ఉచిత ఇసుక పై తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డికి, అర్ధమయ్యే భాషలో సమాధానం చెప్పిన చంద్రబాబు గారు.. pic.twitter.com/3npnaI4T6V

— Telugu Desam Party (@JaiTDP)
click me!