వైసిపిలోకి సాయిప్రతాప్..టిడిపికి షాక్

First Published Jan 25, 2018, 2:39 PM IST
Highlights
  • వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం టిడిపిపై మొదలైనట్లే కనబడుతోంది.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం టిడిపిపై మొదలైనట్లే కనబడుతోంది. పాదయాత్ర మొదలైన దగ్గర నుండి వివిధ జిల్లాల్లోని టిడిపి నేతలు అక్కడక్కడ జగన్ ను కలుస్తున్నారు. వైసిపిలో చేరుతున్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తున్నపుడు టిడిపి నుండి వైసిపిలోకి చేరికలు జరిగాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే, త్వరలో కడప జిల్లాలో టిడిపి నుండి మరో పెద్ద నేత వైసిపిలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

రాజంపేట లోక్ సభ మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ త్వరలో వైసిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు చెప్పారు. ఇపుడు చేస్తున్న పాదయాత్ర కూడా అందులో భాగమేనట.

టిడిపిలో ఉంటూ జగన్ ను ప్రశంసించటమంటే ఏమిటి అర్ధం? అంటూ జిల్లా టిడిపి నేతలు ఆరాలు తీస్తున్నారు. ఇదే విషయాన్ని దావోస్ నుండి చంద్రబాబునాయుడు తిరిగి రాగానే ఫిర్యాదు చేయాలని కూడా అనుకుంటున్నారట. అసలైతే, సాయి ఎప్పుడో వైసిపిలో చేరాల్సింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బాగా సన్నిహితుడైన సాయి వివిధ కారణాల వల్ల జగన్ కు దూరమై టిడిపిలో చేరారు.

అయితే, టిడిపిలో చేరారు కానీ అక్కడ ఇమడలేకపోతున్నారట. ఎటూ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయ్. కాబట్టి వైసిపిలో చేరి మళ్ళీ ఎంపిగా పోటీ చేయాలన్నది సాయి ఆలోచన కావచ్చని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే మరి సిట్టింగ్ ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పరిస్ధితేంటి? లేకపోతే సాయిని రాజంపేట నుండే ఎంఎల్ఏగా పోటీ చేయమంటారా అన్న విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి సాయిప్రతాప్ త్వరలో వైసిపిలో చేరుతారు అన్న ప్రచారం మాత్రం జోరుగా మొదలైంది.

click me!