జనసేనాని ఎక్కడ ?

Published : Mar 07, 2017, 01:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
జనసేనాని ఎక్కడ ?

సారాంశం

పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టి పెట్టటంతో పాటు ప్రజల్లో ఉంటేనే ప్రజలు కూడా ఆధరిస్తారని పవన్ ఇప్పటికైనా గ్రహించాలి. లేకపోతే పిఆర్పి అనుభువమే రిపీట్ అవుతుంది.

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి. పార్టీ పెట్టినదగ్గర నుండి ఇంత వరకూ రాజకీయాన్ని పవన్ సీరియస్ గా తీసుకున్నదాఖలాల్లేవు. పార్టీ పేరు తప్ప నిర్మాణమన్నదే లేదు. ఎన్నికలేమో మరో రెండున్నరేళ్ళలోకి వచ్చేసింది. ఇంతవరకూ పార్టీ నిర్మాణాన్నే చేపట్టకపోతే ప్రజల్లోకి పార్టీ ఏ విధంగా వెళుతుందో అర్ధం కావటం లేదు. పైగా పవన్ కూడా పార్టీ నిర్మాణమెందుకు అని ప్రశ్నిస్తున్నారు?

 

జనసేనకు ఓట్లు వేయాలని ప్రజలు అనుకుంటున్నా పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేయించే యంత్రాంగం చాలా అవసరం. ఆ యంత్రాంగం పార్టీ నిర్మాణంతోనే సాధ్యమవుతుంది. ఒకపుడు ప్రజారాజ్యం కూడా ఈ విషయంలోనే విఫలమైంది. గ్రామస్ధాయి నుండి పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రం వరకూ ఉన్నపుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజలకు ఏ సమస్య తలెత్తినా ఫలానా వ్యక్తి వద్దకు వెళ్ళాలని అనుకోవాలంటే నేతలు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ పవన్ వద్దకు వెళ్ళలేరు కదా?

 

ఇక్కడొక విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతరేకత మొదలైంది. సహజంగా అయితే, వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా ప్రతిపక్ష వైసీపీవైపే మొగ్గాలి. మరి అలా మొగ్గుతున్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ నేపధ్యంలో కూడా పవన్ పార్టీ నిర్మాణాన్ని చేపట్టకుండా, నిత్యమూ ప్రజల్లో ఉండకుండా ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుస్తానంటే కుదరదు. ట్విట్టర్లో స్పందిస్తాను, ఎప్పుడో ఒకసారి బహిరంగ సభల్లో ప్రసంగిస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. మొన్న దివాకర్ బస్సు ప్రమాదంలో బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిక్కులేదు. అడిగిన ప్రతిపక్ష నేతపై ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది.

 

పవన్ కు అశేష సంఖ్యలో అభిమానులుండవచ్చు.  అయితే, వారిలో ఓట్లున్న వారి సంఖ్య ఎంత? ప్రజారాజ్యం అనుభవంతో చేతులు కాల్చుకున్న సొంత సామాజికవర్గం నేతలు పవన్ వైపు మొగ్గటానికి వందసార్లు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇతర సామాజికవర్గాలపై విరుచుకుపడుతున్న అభిమానుల వల్ల జనసేనకు నష్టమే అన్న  విషయాన్ని పవన్ గ్రహించాలి. కాబట్టి ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టి పెట్టటంతో పాటు ప్రజల్లో ఉంటేనే ప్రజలు కూడా ఆధరిస్తారని పవన్ ఇప్పటికైనా గ్రహించాలి. లేకపోతే పిఆర్పి అనుభువమే రిపీట్ అవుతుంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu