
ప్రజారాజ్యం వైఫల్యాలపై పవన్ ఇపుడు తీరిగ్గా అధ్యయనం చేస్తున్నారా? పవన్ ఏంటి, ప్రజారాజ్యం (పిఆర్పీ) వైఫల్యాలపై ఇపుడు అధ్యయనం చేయటమేంటి? అసలిపుడు పీఆర్పీ గోలేంటి అనుకుంటున్నారా? నిజమే. పవన్ పిఆర్పీ వైఫల్యాలపై అధ్యయనం చేస్తున్నది వాస్తవమేనని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇంతకీ విషయమేంటంటే,
ఇటీవలే తన సామాజికవర్గానికే చెందిన కొందరితో పవన్ సమావేశమయ్యారు. అందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు లేండి. ఆ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. అవేంటంటే, జనసేన పార్టీ అన్నది ఒక సామాజిక వర్గం కోసమే ఏర్పాటైనది కాదు అని జనాలందరి చేత అనిపించుకోవాలన్నది పవన్ ఉద్దేశ్యమట. ప్రజారాజ్యం ఎక్కడ విఫలమైంది అనే విషయాన్ని తాను అధ్యయనం చేస్తున్నట్లు వపన్ చెప్పారట. అలాగే, దసరా పండుగ తర్వాత గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ కమిటీలన్నింటినీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట.
అదే సమయంలో పవన్ జనసేన పెట్టింది, పనిచేస్తున్నది చంద్రబాబునాయుడు కోసమేనని జనాలు అనుకుంటున్నారని. అదేవిధంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైపు గుండుగుత్తగా మళ్ళకుండా పవన్ జనసేనను అడ్డుపెడుతున్నారు అని. ఈ విషయాన్ని సమావేశంలో పలువురు నేరుగానే ప్రస్తావించారట. అయితే పవన్ పెద్దగా స్పందించలేదని సమాచారం. అంతా బాగానే ఉంది కానీ సమావేశం పెట్టిందే మనసువిప్పి మాట్లాడుకునేందుకు. మరి ఆ దిశగానే చర్చలు జరిగాయా అంటే డౌటే.
ఇక, ప్రజారాజ్యం వైఫల్యంపై పవన్ ఇపుడు అధ్యయనం చేయటమేంటో అర్ధం కావటం లేదు. ప్రజారాజ్యం ఏర్పాటులో పవన్ కూడా కీలకవ్యక్తే. ఎలాగంటే యువరాజ్యానికి పవనే అధ్యక్షుడు. అభ్యర్ధుల ఎంపికలో పవన్ కూడా కీలకపాత్రే పోషించారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో కుటుంబ సభ్యులే కీలకమన్నది అప్పట్లో వినబడిన ఆరోపణ.
పిఆర్పీ తరపున పోటీ చేసిన అభ్యర్ధుల్లో చాలా మంది నుండి కుటుంబసభ్యుల్లో కొందరు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసారన్నది మరో ప్రధాన ఆరోపణ. ఎన్నికలకు ముందే పలువురు తమ నుండి చిరంజీవి కుటుంబసభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు బహిరంగంగానే అరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
అందుకే పిఆర్పీ తరపున పోటీ చేసిన వారిలో అత్యధికులు ఇప్పటికీ కోలుకోలేదన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. అందుకనే, జనసేన అంటే చాలామంది ఇప్పటికీ పిఆర్పీ అనుభవాలే గుర్తుకు తెచ్చుకుంటారు. ఇటువంటి పరిస్ధితిల్లో పవన్ పై ఆ ముద్ర ఎప్పుడు పోవాలి? పవన్ అధ్యయనం ఎప్పటికి పూర్తవ్వాలి? పవన్ కల్యాణ్ న్ను జనాలు ఎప్పటికి నమ్మాలి?