
తెలుగుదేశంపార్టీలోని పలువురు సీనియర్లకు మొండి చెయ్యి తప్పదా? అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం తేల్చేయటంతో చంద్రబాబులో అయోమయం మొదలైంది. ఇప్పటి నుండే ఫిరాయింపు నియోజవకర్గాల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు పార్టీ కొంపముంచుతుందన్న ప్రమాదాన్ని చంద్రబాబు గ్రహించారు. అందుకే అద్దంకి నియోజవర్గంతో ఆపరేషన్ మొదలుపెట్టినట్లు కనబడుతోంది.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో సీనియర్ నేత, ఎంఎల్సీ కరణం బలరాంను కాదని ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటికి పూర్తిస్ధాయి మద్దతు పలకటం ద్వారా చంద్రబాబు తన ఆలోచనలను బయటపెట్టినట్లైంది. దాంతో మిగిలిన నియోజకవర్గాల్లోని సీనియర్లలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే, వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. అప్పటికే ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలుగా ఉన్న సీనియర్ నేతలకు నోటికి వచ్చిందేదో సర్దిచెప్పి ఫిరాయింపులను ప్రోత్సహించారు.
అటు ఫిరాయింపులకైనా, ఇటు సీనియర్లకైనా చంద్రబాబు చెప్పిందొకటే. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, అందరికీ టిక్కెట్లు సర్దుబాటు చేస్తానని హామీలిచ్చారు. ఇంత వరకూ అదే మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చారు. సీట్లు పెరిగే అవకాశం లేదన్న విషయం అటు చంద్రబాబుకు ఇటు ఫిరాయింపుతో పాటు సీనియర్లకు కూడా తెలుసు. అయినా అదే విషయాన్ని చంద్రబాబు ఎందుకు ప్రస్తావించారు? అంటే అందుకు కారణం కేంద్రంలో చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన వెంకయ్యనాయుడే.
అసెంబ్లీ సీట్లు పెరిగే విషయం ఎప్పుడు చర్చకు వచ్చినా బిల్లు రెడీ అవుతోందని, చెబుతుండే వారు వెంకయ్య. దాంతో అందరూ నిజమనే అనుకునేవారు. కానీ అసెంబ్లీ సీట్ల పెంపు 2024 వరకూ సాధ్యం కాదని తెలంగాణా సిఎం కెసిఆర్ కు ప్రధానమంత్రి తేల్చి చెప్పేసారు. అప్పటి నుండి ఏపిలోని పలువురు సీనియర్ నేతలకు, ఫిరాయింపు ఎంఎల్ఏల్లోనూ గందరగోళం మొదలైంది. అది గ్రహించిన చంద్రబాబు ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లే కనబడుతోంది.
అందుకే కరణం విషయంలో తన మనసులోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. అంటే పార్టీలో కొనసాగే విషయంలో కరణమే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలిపుడు. అదే పరిస్ధితి మిగిలిన 20 ఫిరాయింపు నియోజకవర్గాల్లోని సీనియర్లకూ తప్పదు. కాకపోతే ఫిరాయింపుల్లో ఎందరికి చంద్రబాబు టిక్కెట్లస్తారన్నదే తేలాలిపుడు.