ఇద్దరూ కలిసే చంద్రబాబును దూరం పెట్టారా ?

First Published Nov 29, 2017, 9:01 AM IST
Highlights
  • మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను గమనిస్తే అందరిలోనూ ఓ అనుమానం మొదలైంది.

మంగళవారం హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను గమనిస్తే అందరిలోనూ ఓ అనుమానం మొదలైంది. ఇంతకీ అదేంటంటే, రెండు కార్యక్రమాలకూ చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందలేదు. అందుకు కారణాలేమై ఉంటాయన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది. రెండు కార్యక్రమాలు కూడా ఒకటి : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్(జిఇఎస్) కాగా రెండోది మెట్రో రైలు ప్రారంభోత్సవం. ముఖ్యఅతిధిగా రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నది  ప్రధానమంత్రి నరేంద్రమోడినే.

మొదటి కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ తీసుకుంటే, అందులో ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 2 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్ లు ప్రారంభించిన ఔత్సాహికులు కూడా ఉన్నారు. చివరకు మాజీ ఎంపి మధుయాష్కీ, సెలబ్రెటీ హోదాలో మంచులక్ష్మీ కూడా హాజరయ్యారు. పారిశ్రామికవేత్త హోదాలో ఉపాసనా తదితరులున్నారు. ఇంతమందికి ఆహ్వానాలు వచ్చినపుడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రం ఎందుకు ఆహ్వానం అందలేదన్నదే పెద్ద ప్రశ్న.

సమ్మిట్ ను జిఇఎస్, కేంద్రప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జిఇఎస్ తరపున ఆహ్వానం లేకపోయినా కేంద్రమన్నా చంద్రబాబును ఆహ్వానించి ఉండవచ్చు. కేంద్రమంటే ఇక్కడే నరేంద్రమోడి తప్ప ఇంకోరు కాదన్న విషయం అందరకీ తెలిసిందే. అప్పటికీ సిగ్గువిడిచి ఏపి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆహ్వనం కోసం కేంద్రానికి లేఖ రాసిందట. అయినా కేంద్రం సానుకూలంగా స్పందిచలేదు.

ఇక, రెండోదైన మెట్రో రైలు ప్రారంభానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం లేదు. ఈ కార్యక్రమం పూర్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసన్నల్లోనే జరిగింది. ప్రధానమంత్రి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు లేకపోవటం పెద్ద వెలితే. ప్రధాని కాని గవర్నర్ కానీ చంద్రబాబును ఆహ్వానించే విషయంలో చొరవ తీసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. లేకపోతే అంతా కలిసే కూడబలుక్కునే చంద్రబాబును దూరంగా పెట్టారా అన్న అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే పై నుండి వచ్చిన ఆదేశాల మేరకే కెసిఆర్ నడుచుకున్నారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా ఎంత ప్రయత్నిస్తున్నా ఏకాంతంగా కలవటానికి చంద్రబాబుకు మోడి అపాయిట్మెంట్ ఇవ్వటం లేదన్న విషయం అందరకీ తెలిసిందే. కారణాలేవైనా కానీండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరూ మాట్లాడుకునే చంద్రబాబును దూరం పెట్టారా అన్న అనుమానాలైతే మొదలయ్యాయి.

 

click me!